17 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ మెడలు వంచగలం: ఎమ్మెల్యే హరీశ్ రావు

17 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ మెడలు వంచగలం: ఎమ్మెల్యే హరీశ్ రావు

ఎల్బీ నగర్, వెలుగు : అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  పార్టీ మెడలు వంచాలంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సీఎం రేవంత్  మాట మీద నిలబడేవారైతే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని సవాల్  విసిరారు. ఆదివారం హైదరాబాద్ లోని హస్తినాపురంలో నిర్వహించిన ఎల్బీ నగర్  అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్  కార్యకర్తల సమావేశంలో  హరీశ్  మాట్లాడారు.

పదేళ్ల కేసీఆర్  ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదన్నారు. ‘‘కృష్ణా నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్  ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్  చేశాం. తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టాం. కానీ, కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు  అప్పగించింది.

ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది” అని హరీశ్  వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్‌‌‌‌కు సాగునీరు, తాగునీటికి సమస్య వస్తుందన్నారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని, నాడు టీడీపీలో ఉన్న రేవంత్.. పోతిరెడ్డిపాడుపై స్పందించలేదన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరువేల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని హరీశ్  ఆరోపించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోపే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయన్నారు.