సిగాచి బాధిత కుటుంబాలకు కోటి ఇస్తమని.. లక్షే ఇచ్చిన్రు: హరీశ్ రావు

సిగాచి బాధిత కుటుంబాలకు  కోటి ఇస్తమని.. లక్షే ఇచ్చిన్రు: హరీశ్ రావు
  •     పీఎఫ్​, లైఫ్​ ఇన్సూరెన్స్​ డబ్బులనూ పరిహారంలో చూపించడం దారుణం: హరీశ్​ రావు
  •     సిగాచి కంపెనీ ఇచ్చిన పైసలనే బాధితులకు ఇచ్చి పరిహారం నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోందని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ  ప్రభుత్వం తరఫున ఇచ్చింది మాత్రం రూ.లక్షేనని బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు విమర్శించారు. కార్మికులు చనిపోయాక వారికి చట్టబద్ధంగా రావాల్సిన పీఎఫ్​, లైఫ్​ ఇన్సూరెన్స్​ డబ్బులను పరిహారం కింద చూపించడం దారుణమన్నారు. ఆ డబ్బులు కంపెనీ జేబులో నుంచి ఇస్తున్న పరిహారం కాదని, కార్మికుల కష్టార్జితం నుంచి వచ్చిన హక్కు అని గుర్తుచేశారు. 

ఆ డబ్బులను కూడా కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంగళవారం ఓ ప్రకటనలో హరీశ్​రావు విమర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందలేదని, బాధిత కుటుంబాలకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కు లేవని హరీశ్​ వాపోయారు. దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్​లోని తన జూబ్లీహిల్స్​ ప్యాలెస్​లో ఉన్న సీఎం, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగాచి పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదన్నారు. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను.. డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారని మండిపడ్డారు. ‘ఇది కేవలం ఒక ప్రమాదం కాదు. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలింది. ఇంత నిర్లక్ష్యం బయటపడినా.. యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉంది. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలి. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు  బేషరతుగా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి’’ అని హరీశ్​ డిమాండ్​ చేశారు.  


వేదపండితులకూ వేధింపులేనా?

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వేద పండితులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరమని హరీశ్​ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరమన్నారు. తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. యాదాద్రి, బాసర, భద్రాచలం వంటి ఆలయాల్లో వేదపండితుల నియామకాలకు సంబంధించి స్థానికులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ.. వేదపండితుల ప్రతినిధులు మంగళవారం హరీశ్​ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీశ్​ మాట్లాడారు. తెలంగాణ దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని, స్థానిక రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్వ్యూ బోర్డుల్లో కూడా తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకే అవకాశం కల్పించాలని కోరారు.


శ్రీశైలానికి కృష్ణా నీళ్లు ఎట్లొస్తయ్​?

మహబూబ్​నగర్, వెలుగు: తుంగభద్ర నదిపై ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టేందుకు సిద్ధమవుతున్నారని, వాటిని పూర్తి చేస్తే శ్రీశైలానికి నీళ్లు ఎట్లా వస్తాయని బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు ప్రశ్నించారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో మంగళవారం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, డిజిటల్ సభ్యత్వ నమోదు,'సర్​'పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘తుంగభద్రపై ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీల కెపాసిటీతో గుండ్రేవుల పనులను మొదలు పెడుతోంది. కర్నాటక ప్రభుత్వం 35 టీఎంసీలతో నవేలి ప్రాజెక్టును కట్టడానికి సిద్ధమవుతోంది. రెండు టీఎంసీలతో కరుడీ, రెండున్నర టీఎంసీలతో చిక్కల్​పర్వి, ఐదు టీఎంసీల కెపాసిటీతో చిక్కలమంచి బ్యారేజ్​ కం బ్రిడ్జ్​లను కట్టేందుకు ప్లాన్​ చేసింది. ఈ రెండు రాష్ట్రాలు 65 టీఎంసీల నీటిని ఆపుకుంటే శ్రీశైలానికి తుంగభద్ర నీళ్లు రావు. ఫలితంగా మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్​లకు నీళ్లు అందవు. దీనివల్ల మొదట నష్టపోయేది పాలమూరు జిల్లానే' అని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయి మూడేండ్లైనా పీఆర్​ఎల్​ఐ నుంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్​లో సీఎం నిర్వహిస్తున్నది రైతుల ఆశీర్వాద సభ కాదని, అది రైతు వంచన సభ అని విమర్శించారు. పాలమూరులో బీఆర్​ఎస్​ మొక్కను మొలవనివ్వనని రేవంత్​రెడ్డి అంటున్నాడని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో మొత్తం 14 స్థానాల్లో గెలిచి తీరుతామని హరీశ్​ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్​ అలీ, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్​, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.