నిరుద్యోగులను నమ్మించి దగా చేసిన్రు : మాజీ మంత్రి హరీశ్రావు

నిరుద్యోగులను నమ్మించి దగా చేసిన్రు : మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట, వెలుగు: ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించిన కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఒక్క నోటిఫికేషన్  ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. సిద్దిపేట లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో శనివారం ఇంటరాక్ట్  అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే, సీఎం మాత్రం యువత నోటిఫికేషన్లు వద్దంటున్నారని అబద్దం చెబుతున్నాడని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్  చౌరస్తాలో కూర్చొని నిరుద్యోగులను నమ్మించి వంచించారని విమర్శించారు.

థియేటర్ల ఓపెనింగ్ కి వెళ్తున్న సీఎంకు అశోక్ నగర్  సెంట్రల్  లైబ్రరీకి పోయే దమ్ము లేదన్నారు. నాడు అశోక్ నగర్  విద్యార్థులను వాడుకొని, ఈరోజు వారిని పోలీసులతో కొట్టిస్తున్నాడని విమర్శించారు. పోలీస్ శాఖలో ఉన్న 19 వేల ఖాళీలను ఎందుకు  భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. విద్యా కమిషన్  రిపోర్ట్ ను బయటపెట్టకుండా చెత్త బుట్టలో వేశారని, మెగా డీఎస్సీ అంటూ ఊరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని ఖాళీలను, టీపీఎస్సీ  గ్రూప్స్  ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్  చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో కలసి సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.