హైదరాబాద్, వెలుగు: భూ దోపిడీ బయటపడడంతో హరీశ్ రావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడని విప్ లు అద్దంకి దయాకర్, ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం సీఎల్పీలో వారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదని హరీశ్ రావు బుకాయిస్తుండని, నందినగర్ ఇల్లు కేసీఆర్ ది కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లేదా? వందల ఎకరాల కుటుంబంలో కేసీఆర్ పుట్టాడని అంటున్న హరీశ్ రావు.. ముందుగా కేసీఆర్ తండ్రికి ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫామ్ హౌస్ లో సర్వేకు కేసీఆర్ ముందుకు వచ్చి అధికారులకు సహకరించాలని వారు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు హరీశ్ రావు సరైన సమాధానం చెప్పకుండా తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి 308 ఎకరాల భూమి ఉందని హరీశ్ రావు నోటికొచ్చినట్టు మాట్లాడుతుండని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వారు సవాల్ విసిరారు.
