యాసంగిలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే హరీశ్‌రావు

యాసంగిలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే హరీశ్‌రావు
  •     మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటరూరల్, వెలుగు: యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో  సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఇర్కోడ్, చంద్లాపూర్ లిఫ్ట్ పనులు స్పీడప్​చేయాలన్నారు. వచ్చే యాసంగి వరకు శాశ్వత కాల్వలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

అవసరమైతే భూసేకరణ చేపట్టాలని కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని ఫోన్ లో కలెక్టర్ ని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న చెక్ డ్యామ్ పనులు త్వరగా చేపట్టాలని, కాల్వల్లో పెరుకుపోయిన చెత్త చెదారం పూడిక తీయించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం లో అధికారులు గోపాల్ కృష్ణ, శంకర్, డీఈ చంద్ర శేఖర్, శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యా సాగర్, వెంకటేశ్ పాల్గొన్నారు.

చిన్నకోడూర్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించాలి

చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులు వెంటనే ప్రారంభించాలని హరీశ్ రావు  కోరారు. మండలంలోని  రైల్వే లైన్, సాగు నీటి కాల్వల పనులను రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలసి పరిశీలించారు. రైల్వే లైన్ లో భాగంగా జరుగుతున్న పనుల నేపథ్యంలో సాగు నీటి కాల్వల్లో మట్టి కూరుకుపోయిందని వెంటనే తొలగించాలని రైల్వే అధికారులను ఆదేశించారు. 

రైల్వే లైన్ క్రాస్ అయ్యే క్రమంలో కాల్వల మీద రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గందే నరేశ్,  ఉపాధ్యక్షుడు సృజన సంపత్ యాదవ్ ను  అభినందించారు.