ఏడోసారి హరీశ్ విక్టరీ.. మొదటిసారి తగ్గిన మెజార్టీ

ఏడోసారి హరీశ్ విక్టరీ.. మొదటిసారి తగ్గిన మెజార్టీ

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యేగా వరుసగా ఏడో సారి గెలిచిన హరీశ్ రావు రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రతి ఎన్నికలో మెజార్టీని పెంచుకుంటూ వచ్చిన హరీశ్ కు.. ఈసారి దెబ్బపడింది. గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీని సాధించిన ఆయన ఈ సారి మాత్రం 83,025 ఓట్ల మెజార్టీకే పరిమితం అయ్యారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇప్పటి దాకా ఎవరూ ఏడు సార్లు వరుసగా గెల్వలేదు. 2004 ఉప ఎన్నికలో మంత్రిగా  మొట్టమొదటిసారిగా పోటీ చేసిన హరీశ్.. ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తర్వాత 2008, 2010 ఉప ఎన్నికల్లో, 2009, 2014, 2018లో వరుసగా సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి దాకా బాగారెడ్డి, కేసీఆర్ మాత్రమే ఆరు సార్లు విజయం సాధించగా.. హరీశ్ ఏడోసారి గెలిచి రికార్డు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన మదన్​మోహన్, కేసీఆర్​లు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తే.. హరీశ్​రావు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 

2004లో తొలిసారి పోటీ

2004 లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన హరీశ్ రావు 24,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత క్రమంగా తన మెజార్టీని పెంచుకుంటూ వచ్చారు. 2018 సాధారణ ఎన్నికల్లో 1,18,696 రికార్డు మెజార్టీతో గెలుపొందినా ఈ ఎన్నికల్లో మాత్రం 83,025 ఓట్ల మెజార్టీ మాత్రమే పొందారు. గత ఎన్నికలతో పొలిస్తే 35,671 ఓట్ల మెజార్టీ తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,78,420 ఓట్లు పోలవ్వగా.. అందులో హరీశ్ రావు 1,04,109  ఓట్లు పొందారు. గడచిన నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన హరీశ్ రావు పోలైన ఓట్లలో వరుసగా లక్షకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం.