హరీశ్.. నీకు విద్యపై  మాట్లాడే నైతిక హక్కు లేదు!

హరీశ్.. నీకు విద్యపై  మాట్లాడే నైతిక హక్కు లేదు!
  • రిపోర్ట్ ఫస్ట్ పేజీ కూడా చదవకుండానే తప్పుడు ప్రచారమా?: ఆకునూరి మురళి
  • మా టీంలో ఆరుగురు పీహెచ్‌‌డీ హోల్డర్లు, 22 మంది ప్రొఫెసర్లున్నరు
  • కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెయ్యి రెట్లు నయం అని కామెంట్‌‌

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో ప్రభుత్వ విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నేతలకు, హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు.. ఇప్పుడు విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. నివేదిక మొదటి పేజీ కూడా చదవకుండానే.. కమిషన్ సభ్యుల విద్యార్హతలపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఏంటని నిలదీశారు.  

హరీశ్‌‌‌‌‌‌‌‌రావు చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌పై శనివారం ఆకునూరి మురళి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.  ‘‘మమ్మల్ని అడిగితే అందరి సీవీలు పంపించే వాళ్లం కదా.. మా ఆఫీస్ టీంలోనే ఆరుగురు పీహెచ్‌‌‌‌‌‌‌‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. ఒకరు ఎన్ఐటీ , ఒకరు ఐఆర్ఎంఏ , మరొకరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారు.

వీరందరికీ టీచింగ్ అనుభవం ఉంది. అంతేకాదు, 22 మంది ప్రొఫెసర్లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా వర్కింగ్ గ్రూప్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. వీరంతా ఎడ్యుకేషనిస్టులే. పాలసీ రీసెర్చ్ అంటే ఒక్క మురళి రాసేది కాదు.. సమిష్టిగా చేసేదని కూడా మీకు తెలియదా?” అని హరీశ్‌‌‌‌‌‌‌‌ను ఎద్దేవా చేశారు.  

కేసీఆర్ ఒక్క గంటైనా రివ్యూ చేశాడా?

హరీశ్‌‌‌‌‌‌‌‌రావు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుందని ఆకునూరి మురళి విమర్శించారు. విద్యా వ్యవస్థ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రెట్లు నయమని అన్నారు. ‘‘ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌పై రేవంత్ రెడ్డి నెలకోసారి రివ్యూ పెడుతున్నారు..  కమిషన్ వేశారు.. వీసీలను నియమించారు.. 10 వేల మంది కొత్త టీచర్లను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

మరి మీ కేసీఆర్ పదేండ్లలో ఏ రోజైనా ఎడ్యుకేషన్ మీద ఒక్క గంట రివ్యూ చేశారా?’’ అని ప్రశ్నించారు. విద్య మీద రాజకీయాలు వద్దని, విమర్శించే ముందు సరిగ్గా హోం వర్క్ చేసి మాట్లాడాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు చురకలంటించారు.