Harleen Deol: పీఎం సార్ మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి.. మోడీకి షాకిచ్చిన టీమిండియా మహిళా క్రికెటర్

Harleen Deol: పీఎం సార్ మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి.. మోడీకి షాకిచ్చిన టీమిండియా మహిళా క్రికెటర్

భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని ప్రశ్నతో బిగ్ షాక్ ఇచ్చింది. బుధవారం (నవంబర్ 05) రాత్రి అధికారిక నివాసంలో హర్మన్‌‌‌‌‌‌‌‌సేనకు ఆతిథ్యం ఇచ్చిన మోదీ.. ప్లేయర్లను సత్కరించి ఒక్కొక్కరితో ఆత్మీయంగా మాట్లాడారు. సుదీర్ఘ పోరాటం, కీలక ఓటముల తర్వాత జట్టు పుంజుకున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హర్లీన్.. ప్రధాని నరేంద్ర మోడీని గ్లామర్ సీక్రెట్ గురించి అడిగింది. ఆమె ప్రశ్నకు అక్కడ ఉన్న సహచర ప్లేయర్స్ తెగ నవ్వుకున్నారు. డియోల్ అడిగిన ప్రశ్నకు మోడీ చిరునవ్వుతో బదులిచ్చారు.  

హర్లీన్ ప్రధానిని ఇలా అడిగింది.. "సర్, మీ చర్మం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దయచేసి మీ చర్మ సంరక్షణ దినచర్య ఏమిటో చెప్పగలరా?". అని హర్లీన్ చిరునవ్వుతో అడిగింది. ఈ ప్రశ్నకు మోడీ స్పందిస్తూ ఇలా జవాబిచ్చారు.. "నేను అలాంటి వాటిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఇదంతా ప్రజల ప్రజల ఆశీర్వాదాలే. 25 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాను. ప్రజల అభిమానమే ఇదంతా". అని చిరునవ్వుతో బదులిచ్చారు. హర్లీన్ ఆ ప్రశ్న అడిగిన వెంటనే టీమిండియా ప్లేయర్ స్నేహ రానా స్పందిస్తూ ఈ దేశంలోని లక్షలాది మంది ప్రేమ అని సమాధానం చెప్పింది. 

టోర్నీ మధ్యలో వరుసగా మూడు ఓటములు ఎదురైనప్పటికీ, ఏమాత్రం నిరుత్సాహపడకుండా జట్టు అద్భుతమైన మనోబలం, పట్టుదల, పోరాటాన్ని చూపెట్టిందని  ప్రధాని కొనియాడారు.  తొలి దశలో సోషల్ మీడియా ట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొని  ఆ ఒత్తిడిని జయించి చరిత్ర సృష్టించిన తీరును ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన తర్వాత మోదీని కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా హర్మన్ ప్రస్తావించింది. ‘అప్పుడు ట్రోఫీ లేకుండా వచ్చాం.  

ఇప్పుడు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌తో రావడం గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలతో తరచుగా మిమ్మల్ని కలుస్తామని ఆశిస్తున్నాం’ అని చెప్పింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన దీప్తి శర్మ  ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ బయోలో ఉన్న  జై శ్రీ రామ్ ప్రస్తావన, చేతిపై ఉన్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని అడగ్గా... అవి తనకు బలాన్ని ఇస్తాయని ఆమె నవ్వుతూ బదులిచ్చింది. 2021లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై హర్లీన్ డియోల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను, తాను అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. తాజా ఫైనల్ విజయం తర్వాత హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బాల్‌‌‌‌‌‌‌‌ను  జేబులో పెట్టుకున్న విషయాన్ని ప్రధాని  ప్రస్తావించగా.. ఆ బాల్‌‌‌‌‌‌‌‌ తన వద్దకు రావడం తన అదృష్టమని హర్మన్  చెప్పింది.