వీడియో: విమెన్స్ క్రికెట్‌లో ఇదే బెస్ట్ క్యాచ్!

వీడియో: విమెన్స్ క్రికెట్‌లో ఇదే బెస్ట్ క్యాచ్!

క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఫీల్డింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ (క్యాచులు పట్టండి, మ్యాచ్‌లు గెలవండి) అనే మాట క్రికెటింగ్ వరల్డ్‌లో బాగా వినిపిస్తూంటుంది. అందుకే ప్రతి జట్టు మెరికల్లాంటి ఫీల్డర్లను తయారు చేసుకోవడంపై శ్రద్ధ పెడుతుంటాయి. పురుషులతోపాటు మహిళల క్రికెట్‌లోనూ ఫీల్డింగ్ ప్రమాణాలు పెరుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా భారత విమెన్స్ ప్లేయర్ హర్లీమ్ డియోల్ పట్టిన క్యాచ్‌ను చెప్పొచ్చు. ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హర్లీన్ పట్టిన ఓ క్యాచ్ గురించి ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ విమెన్ తరహాలో డైవింగ్ చేస్తూ హర్లీన్ క్యాచ్ పట్టిన తీరుకు సాధారాణ క్రికెట్‌ ఫ్యాన్స్‌తో సహా ఆనంద్ మహింద్రా లాంటి పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. ఈ క్యాచ్‌ నమ్మశక్యంగా లేదని.. వండర్ విమెన్ సినిమాలోని గల్ గడోట్‌ను గుర్తు చేసేలా హర్లీన్ ఫీల్డింగ్ విన్యాసం ఉందని మహింద్రా ట్వీట్ చేశారు. హర్లీమ్ పట్టిన క్యాచ్ విమెన్స్ క్రికెట్‌లో అత్యుత్తమ క్యాచ్ అని సీనియర్ క్రికెటర్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.