IND vs ENG 2025: బజ్ బాల్ కాదు అహంకారం.. ఇంగ్లాండ్ బ్యాటర్‌పై లంక దిగ్గజం విమర్శలు

IND vs ENG 2025: బజ్ బాల్ కాదు అహంకారం.. ఇంగ్లాండ్ బ్యాటర్‌పై లంక దిగ్గజం విమర్శలు

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు క్లైమాక్స్ కు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ ను కేవలం 192 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 193 పరుగులు చేస్తే లార్డ్స్ టెస్టులో విజయం సాధించి 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర ఇంగ్లాండ్ జట్టుపై భారీగా విరుచుకుపడ్డాడు. బజ్ బాల్ తర్వాత సంగతి ఇంగ్లాండ్ అహంకారమే వారిని పతన స్థాయికి తీసుకు వచ్చిందని తెలిపాడు. 

ముఖ్యంగా బ్రూక్ నిర్లక్ష్యంగా ఔటవ్వడం పట్ల సంగక్కర తన అసంతృప్తి వెల్లడించాడు. " బ్రూక్ స్కూప్ చేసిన విధానం నాకు అతని  నిర్లక్ష్యంగా అనిపించింది. లంచ్ కు ముందు ఇలాంటి షాట్ ఆడడం చాలా పెద్ద తప్పు. లంచ్ కు 10 నిమిషాల ముందు ఎటాకింగ్ చేయడం తెలివైన బ్యాటింగ్ కాదు.  ఇది ఓవర్ యాక్షన్ కాదు.. బజ్ బాల్ కాదు.. ఈ ఎటాకింగ్ గేమ్ కేవలం అహంకారంలా అని అనిపిస్తుంది". అని సంగక్కర అన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్రూక్ అంతక ముందు నితీష్ ఓవర్ లో చివరి మూడు బంతులను వరుసగా 4,4,6 పరుగులు కొట్టి ఎదురు దాడికి దిగాడు. అదే ఊపుతో స్వీప్ చేద్దామని భావించి ఆకాష్ దీప్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

బ్రూక్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఈ దశలో 67 పరుగులు జోడించి స్టోక్స్, రూట్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సుందర్ రాకతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. రూట్, స్మిత్, స్టోక్స్ లను సుందర్ బౌల్డ్ చేయడం విశేషం. సుందర్ తో పాటు సిరాజ్, బుమ్రా చెలరేగడంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులకు ఆలౌట్ అయింది.