అధికారులకు హార్వర్డ్ నిపుణులతో క్లాసులు : సీఎం రేవంత్రెడ్డి

అధికారులకు హార్వర్డ్ నిపుణులతో క్లాసులు : సీఎం రేవంత్రెడ్డి
  • ఇక్కడే ఆరునెలల శిక్షణతో మన ఆఫీసర్ల స్కిల్స్ ప్రపంచస్థాయికి: సీఎం రేవంత్​రెడ్డి
  •  ప్రభుత్వంతో ఒప్పందానికి.. ఆ యూనివర్సిటీ అంగీకారం
  • చట్టాలు, రూల్స్ పేదల పనుల కోసం.. అడ్డుకోవడానికి కాదు
  •  ప్రజా సేవలో తరించాలి
  • గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం 

హైదరాబాద్, వెలుగు: ఉన్నతాధికారులకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో క్లాసులు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. మన అధికారుల నైపుణ్యాలు ప్రపంచ స్థాయికి పెంచడం కోసం ఇక్కడే ఆరునెలలు శిక్షణ ఇప్పించాలనుకుంటున్నట్టు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

నిన్నటి వరకు నిరుద్యోగులైన మీరు నేడు ప్రభుత్వ అధికారులయ్యారని, ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజా పాలనను నాలుగు కోట్ల ప్రజలకు అందించడానికి ఈ శిక్షణ, అనుభవం వినియోగించాలన్నారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. చట్టాలు, నియమాలు, ఆదేశాలు పని చేయకుండా ఆపడానికి కాదని, పది మందికి సహాయం చేయడానికి ఉపయోగపడాలన్నారు. 

అక్కడే అధికారుల విచక్షణ, కామన్​సెన్స్ అత్యంత కీలకమన్నారు. దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఈ తెలంగాణ గడ్డ ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఏమాత్రం అంగీకరించరని తెలిపారు. ఈ సందర్భంగా రాంజీ గోండు, కుమ్రం భీమ్, సమ్మక్క సారలమ్మ తిరుగుబాట్లను గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం,స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం పోరాడి వారంతా అమరవీరులు అయ్యారన్నారు. అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

సర్వీస్​కమిషన్​ను ప్రక్షాలన చేశాం

అత్యంత నిష్ణాతులైన విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి వారిని కమిషన్​ చైర్మన్​గా నియమించి కాంగ్రెస్​ ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిందని సీఎం రేవంత్​వివరించారు.  గత పదిహేనేండ్లుగా నిరుద్యోగులు పడిన కష్టాలను చూసి చలించిన తమ ప్రభుత్వం కోర్టు కేసుల్లో అభ్యర్థుల పక్షాన నిలబడి కొలువులు అందించిందని స్పష్టం చేశారు. పగబట్టినట్లు కొందరు ఎన్ని కుట్రలు చేసినా, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా యువత ప్రతిభను నమ్మి సర్కారు న్యాయ పోరాటం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ, పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి అధికారి తన బాధ్యతలను విస్మరించకుండా నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా సేవలో తరించాలని ఆయన హితవు పలికారు.

 పాలకుడిగా తాను సచివాలయంలో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోగలనని, వాటిని క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా అందించాల్సిన పూర్తి బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ కొలువు సాధించిన ఆనందం ఒక ఎత్తైతే, ఆ పదవికి న్యాయం చేస్తూ జీవితాంతం ప్రజల మన్ననలు పొందడం మరో ఎత్తని తెలిపారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉండే ఉత్సాహం రానురాను తగ్గిపోయి, చివరకు బేషరంగా అవినీతికి అలవాటు పడే ప్రమాదం ఉందని, ఆ మూడు దశలను అధిగమించి ఎల్లప్పుడూ నిజాయితీగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే ఈరోజు అత్యధికంగా అధికారులుగా ఎంపికయ్యారని, తమ గతాన్ని గుర్తుచేసుకుంటే ఏ అధికారీ తప్పు చేయడానికి సాహసించడని ఆయన అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత 

ప్రతి ఉద్యోగీ తమను కష్టపడి చదివించిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, లేకపోతే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం హెచ్చరించారు.   వయసు మళ్లిన కన్నవారిని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను చూస్తే తన కష్టం వృథా అయినట్లేనని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వేతనాల్లో కోత విధింపు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయని, రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని చదివించిన వారి రుణం తీర్చుకోవాల్సిన కనీస ధర్మం యువతపై ఉందన్నారు. 

మరోవైపు మన అధికారులను ప్రపంచస్థాయికి తీర్చిదిద్దేందుకు తాను ఇటీవల అమెరికా పర్యటనలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపానని వెల్లడించారు. మన వాళ్లందరినీ అక్కడికి పంపడం ఆర్థికంగా కష్టమైన పని కాబట్టి, ఆ విశ్వవిద్యాలయంతోనే ఒప్పందం చేసుకుని ఇక్కడి మర్రి చెన్నారెడ్డి ప్రాంగణంలో పాఠాలు చెప్పించేలా ముందడుగు వేశామన్నారు. వచ్చే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఒప్పందం పూర్తవుతుందని, భవిష్యత్తులో మన అధికారులు విదేశీ సర్టిఫికెట్ కోర్సులు చేసే అద్భుత అవకాశం రాబోతున్నదన్నారు.