హర్యానా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుండి జూలై 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందుగా జూన్ 24న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ తో ప్రారంభమవుతుంది.
బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా జూన్ 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు
జూన్ 25 గురువారం: ధ్వజారోహణం, పెద్దశేష వాహనం.. బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం నిర్వహించి, సాయంత్రం పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
జూన్ 26 శుక్రవారం: చిన్నశేష వాహనం, హంస వాహనం..ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహనంపై స్వామివారి దివ్య విహారం జరుగుతుంది.
జూన్ 27 శనివారం: సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం..ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహన సేవలు నిర్వహిస్తారు.
జూన్ 28 ఆదివారం: కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం.. భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనం, అనంతరం సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి.
జూన్ 29 సోమవారం: మోహినీ అవతారం, కల్యాణోత్సవం, గరుడ వాహనం..ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు దర్శనమివ్వగా, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహన సేవ జరుగుతుంది.
జూన్ 30 మంగళవారం: హనుమంత వాహనం, గజ వాహనం.. ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
జూలై 1 బుధవారం : సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం..ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దివ్య దర్శనం కల్పిస్తారు.
జూలై 2 గురువారం: రథోత్సవం, అశ్వ వాహనం..భక్తుల గోవిందనామ స్మరణల మధ్య రథోత్సవం నిర్వహించి, రాత్రి అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తారు.
జూలై 3 శుక్రవారం: చక్రస్నానం, ధ్వజావరోహణం.. పవిత్ర చక్రస్నానంతో పాటు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
జూలై 4 శనివారం : పుష్పయాగం.. బ్రహ్మోత్సవాల అనంతరం జూలై 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు.. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ తెలిపింది.
