హర్యానాలో 250 గుడిసెలు కూల్చివేత

హర్యానాలో 250 గుడిసెలు కూల్చివేత

బుల్డోజర్లు దించిన ఖట్టర్ సర్కార్
అల్లర్లకు కారణమైన  వారిపై చర్యలు


గురుగ్రామ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బుల్డోజర్లను రంగంలోకి దించింది. హింస జరిగిన ఏరియా నుంచి 20 కిలో మీటర్ల దూరంలోని టౌరు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ ప్లేస్​లో వాళ్లు ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు కూల్చేశారు. ఈ గుడిసెల్లో ఉన్నవాళ్లే అల్లర్లకు కారణమయ్యారని భావించి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. 

హింసాకాండలో వలసదారుల హస్తం ఉందంటూ ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఈ రూమర్లను ఖండించా రు. హర్యానా షహరీ వికాస్ ప్రాధికారన్ (హెచ్ఎస్​వీపీ) భూమిని గతంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నారని తెలిపారు. అందుకే, ఆ గుడిసెలు కూల్చేశామని వివరించారు. కూల్చివేతకు, ఇటీవల జరిగిన హింసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆక్రమణల తొలగింపు డ్రైవ్​ను ఆ ప్రాంతంలోని కొందరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారిని మహిళా పోలీస్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్​లు నిలువరించాయి.


గురుగ్రామ్​లో హిందూ సంస్థల నిరసన
నూహ్ అల్లర్లను నిరసిస్తూ గురుగ్రామ్​లోని పటౌడీ ఏరియాలో శుక్రవారం హిందూ సంస్థలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా బంద్​కు పిలుపునివ్వడంతో పటౌడీ, జటౌలీ మార్కెట్లు మూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తపడ్డాయి. హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పటౌడీ సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి, హర్యానా గవర్నర్, సీఎంకు మెమోరాండమ్ సమర్పించాయి. శుక్రవారం కావడంతో గురుగ్రామ్​లోని మసీదుల్లో నమాజ్​కు పోలీసులు అనుమతివ్వలేదు. మత పెద్దలతో మాట్లాడి తమ తమ ఇండ్లలోనే నమాజ్ చేసుకునేలా సూచించారు.