ఎన్నికల టైంలో వెళ్లిపోయినోళ్లను మళ్లీ ఎలా తీసుకుంటారు ?

ఎన్నికల టైంలో వెళ్లిపోయినోళ్లను మళ్లీ ఎలా తీసుకుంటారు ?
  • మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి  చేరికను వ్యతిరేకిస్తున్న  ప్రస్తుత ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్
  • టికెట్ విషయం స్పష్టత ఇవ్వాల్సిందేనని పట్టు

సిద్ధిపేట జిల్లా:  హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలతో ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి అత్యవసరంగా సమావేశమయ్యారు. గత ఎంపీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీని వదిలి  టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి తిరిగి ఎందుకు తెస్తున్నారని శ్రీరాంచక్రవర్తి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత 50 ఏళ్లుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కాంగ్రెస్ పార్టీకోసం చేసిన సేవలకు గుర్తింపు ఇదేనా అంటూ నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ టికెట్  విషయంలో స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడతామని కార్యకర్తలతో బొమ్మ శ్రీరామ్ చెప్పారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీకి నష్టం చేసి వెళ్లిపోయిన ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి తిరిగి ఎలాతీసుకుంటారని బొమ్మ శ్రీరాం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.