హైదరాబాద్‌సిటీ, వెలుగు: గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై అమల్లో ఉన్న ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేసింది. అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంగూర్ భాయ్‌పై అనేక కేసులు ఉన్నాయని, ఆమెపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ధూల్‌పేట ఎక్సైజ్ సీఐ మధుబాబు, ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి కలిసి ప్రభుత్వ అడ్వైజరీ బోర్డుకు ప్రతిపాదించారు.
బోర్డు సిఫారసు మేరకు అప్పటి హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ ఏడాది ఏప్రిల్15న అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇటీవల అంగూర్ భాయ్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న అనంతరం మంగళవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంగూర్ భాయ్ పై పీడీ యాక్ట్ అమలును సమర్థించింది.
