టెస్టులు చేయకుండా గ్రీన్​ జోన్లుగా ఎలా మారుస్తారు?

టెస్టులు చేయకుండా గ్రీన్​ జోన్లుగా ఎలా మారుస్తారు?

హైదరాబాద్, వెలుగు‘‘కరోనా టెస్టులు చేయకుండా రెడ్, ఆరెంజ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా ఎలా ప్రకటిస్తారు. సూర్యాపేటలో ఏప్రిల్‌ 22 తర్వాత టెస్టులు చేశారో లేదో చెప్పాలి. అసలు రాష్ట్రంలో టెస్టింగ్​ ల్యాబ్స్‌ ఎన్ని ఉన్నాయో వివరాలివ్వండి. కరోనా కట్టడి కోసం మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లను అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ఏమైనా ఉంటే తెలియజేయండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్‌ కేరళలో బాగా అదుపులోకి వచ్చిందని, అక్కడ మొబైల్​ టెస్టింగ్​ ల్యాబ్స్​ ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించిందని, అదే తరహాలో రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకునేదీ లేనిదీ వివరించాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం తరఫున నివేదిక సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ తర్వాత అత్యధికంగా సూర్యాపేటలో 83 కేసులు నమోదయ్యాయని, అయినా అక్కడ కరోనా టెస్టులను ఆపేయడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ సంకినేని హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్  రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్​ సోమవారం మరోసారి విచారణ జరిపింది.

పిటిషనర్​ తరఫున లాయర్​ జి.పూజిత వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్​ 22 నుంచి సూర్యాపేటలో కరోనా టెస్టులు ఆపేశారని, రాష్ట్ర ప్రభుత్వం చాలా జిల్లాలను రెడ్, ఆరెంజ్​ జోన్లను గ్రీన్‌‌ జోన్లుగా మార్చిందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో 19,278 వేల టెస్టులే చేశారని, అదే ఏపీలో 1.49 లక్షలకుపైగా టెస్టులు చేశారని చెప్పారు. సూర్యాపేటలో అన్ని జోన్లలోని వారికీ కరోనా టెస్టులు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు సూర్యాపేటలో ఏప్రిల్‌‌ 22 తర్వాత టెస్టులు చేశారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

నిర్మల్‌ జిల్లాలో ఎన్ని టెస్టులు చేశారు?

నిర్మల్‌‌ జిల్లాలో ఏప్రిల్​22 నుంచి ఇప్పటిదాకా చేసిన కరోనా టెస్టులపై రిపోర్ట్​ ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్​ రాఘవేంద్ర సింగ్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్​ ఆదేశించింది. నిర్మల్‌‌ జిల్లాలో కరోనా టెస్టులను ఆపేశారంటూ దాఖలైన పిల్‌‌ను సోమవారం విచారించింది. వలస కూలీలు పెద్ద సంఖ్యలో నిర్మల్‌‌ జిల్లాకు వచ్చారని, టెస్టులు చేయకపోతే వైరస్‌‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పిటిషనర్​ తరఫు లాయర్​ చిన్నోళ్ల నరేష్‌‌రెడ్డి వాదించారు. స్పందించిన బెంచ్.. ‘‘వలస కూలీల ద్వారా వైరస్‌‌ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వలస కూలీలు ఎంత మంది వచ్చారు. వారికి టెస్టులు చేస్తున్నారో లేదో తెలియజేయండి” అని నిర్మల్​ కలెక్టర్​ను ఆదేశించింది. ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేలా చర్యలు తీసుకోవాలని, వైరస్​ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌‌కు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

డైరెక్ట్‌‌ కాంటాక్టులకు  కరోనా టెస్టులు తప్పనిసరి