
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ బాడీని మొత్తం సీఐడీ అదుపులోకి తీసుకుంది.
కాగా, 2025 ఐపీఎల్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల గురించి వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ మ్యాచ్ సందర్భంగా తమకు టికెట్స్ కేటాయించలేదని స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్‌కు హెచ్‌సీఏ తాళం వేసింది. ఈ ఘటనతో విసిగిపోయిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హైదరాబాద్ వదిలిపోతామని హెచ్చరించింది. ఈ వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ మేరకు ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్‌ని ఇబ్బందులకు గురి చేసినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం10 శాతం టికెట్లు ఫ్రీగా ఇస్తామన్నప్పటికీ.. 20 శాతం టికెట్లు కావాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చినట్టు దర్యాప్తులో గుర్తించారు విజిలెన్స్ అధికారులు.
ఫ్రీగా 10 శాతం కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పడంతో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఇందుకు హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకుంది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేయగా.. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చేది లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది.
►ALSO READ | Wiaan Mulder: ముల్డర్ బయపడ్డాడు.. తప్పు చేశాడు.. నేనైతే కొట్టేవాడిని: సఫారీ ఆల్ రౌండర్‌పై గేల్ విమర్శలు
టికెట్లు ఇవ్వకపోవడంతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారించిన విజిలెన్స్ అధికారులు.. హెచ్‌సీఏపై చర్యలకు సిఫారసు చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును బుధవారం (జూలై 9) సీఐడీ అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ బాడీ మొత్తాన్ని అదుపులోకి తీసుకుంది సీఐడీ.