జవాన్ కిడ్నాప్ అవాస్తవం: వదంతులు నమ్మొద్దన్న రక్షణ శాఖ

జవాన్ కిడ్నాప్ అవాస్తవం: వదంతులు నమ్మొద్దన్న రక్షణ శాఖ

జమ్ముకశ్మీర్‌కు చెందిన జవాన్‌ మహమ్మద్ యాసీన్ కిడ్నాప్ అయ్యాడని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల్ని రక్షణ శాఖ ఖండించింది. ఊహాగానాలను ప్రసారం చేయొద్దని, ఆయన సురక్షితంగానే ఉన్నారని ప్రకటించింది. సెలవుపై ఆయన తన స్వగ్రామంలో ఉన్నారని చెప్పింది.

జమ్ముకశ్మీర్‌ లోని బద్గాం జిల్లా ఖాజీపుర చదూర ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ యాసీన్‌ ఆర్మీలోని జమ్ము అండ్ కశ్మీర్ లైట్ ఇన్ ఫాంటరీ రెజిమెంట్ లో జవాన్ గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 వరకు సెలవుపై ఇంటికి వెళ్లారు. అయితే శుక్రవారం సాయంత్రం కొందరు దుండగులు ఆయన ఇంటికెళ్లి కిడ్నాప్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. యాసీన్ ను టెర్రరిస్టులే కిడ్నాప్ చేశారని, సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. ఆయన్ని కాపాడేందుకు ఆర్మీ ఆపరేషన్ మొదలు పెట్టిందని ఉన్నతాధికారులను కోట్ చేస్తూ వార్తలు వచ్చాయి.

అయితే ఇది పూర్తిగా అవాస్తవమని రక్షణ శాఖ ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని, వాటిని ప్రచారం చేయొద్దని సూచించింది.