కరోనా కొత్త వేరియంట్ టెన్షన్

కరోనా కొత్త వేరియంట్ టెన్షన్

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. రూపం మార్చుకుంటూ ఇంకా ప్రభావం చూపుతోంది. డెల్టా వేరియంట్ తర్వాత తాజాగా ఒమిక్రాన్ పేరుతో కొత్త రూపం దాల్చుకుంది. సౌతాఫ్రికన్లపై మెల్లగా ఎఫెక్ట్ ప్రారంభించిన ఒమిక్రాన్ ఇప్పుడు దేశాలకు పాకుతోంది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు వీకెండ్ లో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులపై నిషేధం విధించింది. అయితే ఇప్పటికే వచ్చిన ప్రయాణికులకు కరోనా టెస్టులు చేస్తూ, హోం క్వారంటైన్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. అవసరమయితే దేశ సరిహద్దుల్లో సైతం కఠిన ఆంక్షలు అమలు చేసి తాత్కాలికంగా మూసివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ ను గుర్తించినా ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి, ఎంత వరకు ఎఫెక్ట్ చూపుతోంది, నివారణ, రక్షణ చర్యలపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రిక నుంచి రాకపోకలపై ఇప్పటికే 18 దేశాలు ఆంక్షలు విధించాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 159 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికాలో 109, బోట్స్ వానాలో 19, నెదర్లాండ్స్ లో 13, యూకేలో 3, హాంకాంగ్ లో 2, కెనడాలో 2, ఆస్ట్రేలియా, డెన్మార్క్ లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 

మరోవైపు ఒమిక్రాన్ భయంతో విదేశీయుల ఎంట్రీపై ఇజ్రాయిల్ ఆంక్షలు పెట్టింది, రెండు వారాల పాటు విదేశీ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మొరాకో దేశం ప్రకటించింది. కొత్త వేరియంట్ ప్రభావం ఉన్నట్లు హాంకాంగ్ నుంచి యూరప్, నార్త్ అమెరికాలో అధికారులు ఇదివరకే అధికారిక ప్రకటనలు చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించిన దేశాలు ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దులు మూసివేస్తుండటంతో అత్యవసర సేవల కోసం తెరిచి వుంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.