పూడ్చిన ఊరచెరువుకు జలకళ.. యాగశాల కోసం పూడ్చిన ఆఫీసర్లు

పూడ్చిన ఊరచెరువుకు జలకళ.. యాగశాల కోసం పూడ్చిన ఆఫీసర్లు
  • ఎడతెరిపిలేని వానలతో ఎగువ నుంచి వచ్చి చేరిన నీరు
  • మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలంటున్న స్థానికులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో  ఇటీవల కురిసిన వానలతో  పూడ్చిన ఊరచెరువుకు జలకళ వచ్చింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డెవలప్​మెంట్​లో  భాగంగా.. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి సమీపంలో ఉన్న ఊరచెరువును ఆఫీసర్లు పూడ్చివేశారు.  వైటీడీఏ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) భూసేకరణ చేసింది.  ఊరచెరువును కూడా వైటీడీఏ తమ ఆధీనంలోకి తీసుకుంది. టెంపుల్ రీఓపెనింగ్(ఆలయ ఉద్ఘాటన) ను వారం రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో 1008 కుండలాలతో మహాయాగం నిర్వహించడానికి దాదాపు 100 ఎకరాల స్థలంలో యాగశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ యాగశాల కోసం ఆఫీసర్లు.. ఊరచెరువును మొత్తం మట్టితో పూడ్చేసి చదును చేశారు. కానీ అనివార్య కారణాలతో ప్రభుత్వం ఆలయ రీఓపెనింగ్ ను ఒక్కరోజులోనే తూతూమంత్రంగా నిర్వహించింది. ఇక అప్పటినుంచి యాగశాల కోసం పూడ్చేసిన ఊరచెరువు ప్లేస్ ఖాళీగా ఉంది.   మూడు, నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడడంతో.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు దిగువన ఉన్న ఊరచెరువు ప్రదేశానికి వచ్చి చేరింది. దీంతో ఊరచెరువు ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయి జలకళ సంతరించుకోవడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఊరచెరువును పూడ్చకుండా అలాగే ఉంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  చెరువును పునరుద్ధరించి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.