సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ సమ్మె ఉధృతం

సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ సమ్మె ఉధృతం

VRAల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకతప్పలేదు. నిన్నటివరకు VRAల ఆందోళనలను పట్టించుకోని సర్కార్.. ఇవాళ వారు పెద్ద ఎత్తున చేసిన నిరసనలు, ఆందోళనలు చూసి దిగి వచ్చింది. లాఠీఛార్జ్ లు, నిర్బంధాలు తట్టుకుని దూసుకురావడం, పెద్దఎత్తున సిటీలో గుమిగూడటం, పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అసెంబ్లీలో 15మంది VRAలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. 

మంత్రి కేటీఆర్ అప్పీల్ తో సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని VRAల ప్రతినిధులు తెలిపారు. ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన ఇవాళ్టి కార్యక్రమం ముగిసిందన్నారు. 20వ తేదీన సీఎస్ చర్చలు జరుపుతారని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు VRA ప్రతినిధులు చెప్పారు. 20న జరిగే సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వీఆర్ఏలు ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో మళ్లీ సమ్మె ఉధృతం చేస్తామన్నారు. రేపటి నుంచి చర్చల సమయం వరకు శాంతియుత నిరసన తెలుపుతామని వీఆర్ఏల ప్రతినిధులు పేర్కొన్నారు. 

50 రోజుల సమ్మెకాలంలో మృతి చెందిన 30 మంది వీఆర్ఏలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వీఆర్ఏల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. పే స్కేల్, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. 

VRAలు చేపట్టిన ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఓ మిలియన్ మార్చ్, సాగరహారాన్ని తలపించేలా.. అరెస్టులు, నిర్భంధాలను, అడ్డంకులను దాటుకుంటూ వీఆర్ఏలు పెద్దఎత్తున గుమిగూడారు . అసెంబ్లీకి నాలుగువైపుల నుంచి ముట్టడికి ప్రయత్నించారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నిరసన తెలిపారు. ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు వందలాది మంది VRAలు ర్యాలీగా బయలుదేరారు. అసెంబ్లీ వైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర VRAలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి.. సర్కార్ కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

VRAలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ధర్నాలో వందలాది మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో పోలీసులు వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. అయినా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా తగ్గలేదు. చివరకు మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన తర్వాత ఆందోళనలు విరమించారు. బుధవారం నుంచి శాంతియుత నిరసనలు కొనసాగుతాయని VRAల ప్రతినిధులు తెలిపారు.