24 గంటల్లో 1,300 కిలోమీటర్లు వెళ్లి ఫ్రెండ్ కు ప్రాణం పోసిండు

24 గంటల్లో 1,300 కిలోమీటర్లు వెళ్లి ఫ్రెండ్ కు ప్రాణం పోసిండు

సీరియస్ కండీషన్​లో రాజన్.. అయిపోవస్తున్న ఆక్సిజన్
రాంచి నుంచి ఘజియాబాద్​కు ఆక్సిజన్ తీస్కెళ్లిన దేవేంద్ర
యూపీలోని ఘజియాబాద్​లో ఘటన

రాంచీ:1,300 కిలోమీటర్ల దూరం.. 24 గంటల సమయం.. ఒక ప్రాణం.. చూడటానికి ఇవి సంఖ్యలే. కానీ ఓ కుటుంబానికి బంధం.. ఓ స్నేహితుడికి బాధ్యత. కలిసిమెలిసి తిరిగినోడికి కష్టమొచ్చిందని.. ఊరు దాటి.. రాష్ట్రం దాటి ఉరికొచ్చిండు దోస్తు. కష్టమని చూడలె.. నష్టమని చూడలె.. తనతో అయితదా? కాదా? అని అనుకోలే. మొండిగా పోయిండు.. ఫ్రెండ్ ను కాపాడుకుండు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్ లో రాజన్ అనే వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఆక్సిజన్ సపోర్టు మీద ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అక్కడ మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. రాజన్​కు 24 గంటల దాకా అందించేంత ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఎక్కడ వెతికినా దొరకలేదు. దీంతో ఈ నెల 24న జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మకు ఫోన్ చేశాడు సంజయ్ సక్సేనా. తమ ఫ్రెండ్ రాజన్ కు ఆక్సిజన్ అత్యంత అవసరమని, 24 గంటల్లోపు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పాడు. ఘజియాబాద్​లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని, ఎంత వెతికినా తమకు దొరకలేదని తెలిపాడు. రాంచీలో దొరుకుతుందేమో చూడాలన్నాడు. 
ముందు దోస్తు ప్రాణం కాపాడు
ఫోన్ పెట్టేసిన దేవేంద్ర.. బైక్​పై 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొకారోకు రాత్రిపూట బయల్దేరాడు. రాజన్ వాళ్ల ఊరు కూడా అదే. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రాత్రంతా తిరిగాడు. చివరికి జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ ఓనర్ రాకేశ్ కుమార్ గుప్తాను కలిశాడు. విషయమంతా చెప్పాడు. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశాడాయన. అంతేకాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలే. ‘ముందు దోస్తు ప్రాణం కాపాడు’ అని చెప్పాడు. సంతోషంగా సిలిండర్ అందుకున్నాడు దేవేంద్ర. కానీ దాన్ని 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రెండ్​కు చేర్చడం ఎలా? ప్రశ్నకు జవాబు వెతకలేదు అతడు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెలిసినవాళ్ల దగ్గర కారు తీసుకుని బయల్దేరాడు. 25న బయల్దేరి, 24గంటలపాటు ప్రయాణించాడు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వెళ్తుండటంతో చాలాచోట్ల పోలీసులు ఆపారు. వారికీ విషయం చెప్పి.. ముందుకెళ్లాడు. 26న గమ్యాన్ని చేరుకుని, ప్రాణమిత్రుడికి ప్రాణవాయువు అందజేశాడు. రాజన్ మెల్లగా కోలుకుంటున్నాడు.
ఇంకో ఫ్రెండ్ ను పోగొట్టుకోలేక..
రాజన్, దేవేంద్రకు ఫ్రెండ్ సంజీవ్ సుమన్.. ఈనెల 19న చనిపోయాడు. అప్పటికే కరోనా బారిన పడిన రాజన్.. ఢిల్లీలో ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నిం చాడు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో ఘజియాబాద్ వెళ్లి.. మిత్రుడు సంజయ్ సక్సేనా సాయంతో ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకు న్న దేవేంద్ర.. మరో దోస్తు ప్రాణాలను పోగొట్టుకోలేక ఇంత రిస్క్ చేశాడు.