68 ఏండ్లు జైల్లోనే: 83 ఏండ్ల వయసులో బయటికొచ్చిండు

68 ఏండ్లు జైల్లోనే: 83 ఏండ్ల వయసులో బయటికొచ్చిండు

ఫిలడెల్ఫియా(అమెరికా): 15 ఏండ్లకే జైలుకు పోయిండు.. ఒకటీ రెండేండ్లు కాదు ఏకంగా 68 ఏండ్లు కటకటాల వెనుకే ఉన్నడు.. 83 ఏండ్ల వయసులో, జీవిత చరమాంకంలో బయటికొచ్చిండు. కానీ అంతా కొత్తగా ఉంది. ఆకాశాన్ని అంటే భారీ బిల్డింగులు.. వేగంగా దూసుకెళ్లే వెహికల్స్.. ఇంకా ఎన్నో వింతలు, విచిత్రాలు.. కొత్త ప్రపంచం ఎగ్జైటింగ్​గా కనిపిస్తే.. తనకంటూ ఎవరూ లేని చివరి రోజులు బాధను కలిగిస్తున్నాయి. ఇదంతా పెద్దాయన జోసెఫ్ లిగోన్ గురించే…!

1953.. అప్పుడేం జరిగింది..

ఆలబామాలో పుట్టాడు జోసెఫ్. నాలుగో తరగతిలోనే స్కూల్ వదిలేశాడు. ఓ టీనేజర్ల గ్యాంగ్​తో తిరిగేవాడు. ఓ రోజు అందరూ ఫుల్లుగా తాగి ఫిలడెల్ఫియాలో రాబరీకి వెళ్లారు. అయితే అక్కడ హింస జరిగింది. ఇద్దరు చనిపోగా, మరో ఆరుగురు కత్తిపోట్లకు గురయ్యారు. తాను గ్యాంగ్​లో ఉన్నానని అంగీకరించిన జోసెఫ్.. ఎవరినీ హత్య చేయలేదన్నాడు. కానీ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది.

మహా మొండోడు

తనకు కొన్ని సార్లు పెరోల్ వచ్చినా నిరాకరించాడు జోసెఫ్. తనపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వదిలిపెట్టాలని కోరాడు. కోర్టులో పోరాటం కొనసాగించాడు. చివరికి కోర్టు ఆదేశాలతో గురువారం బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. బయటికి రాగానే.. ఫిలడెల్ఫియాలో బిల్డింగులను చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. అప్పట్లో ఏం లేవు” అని అన్నాడు. స్థానిక ‘యూత్ సెంటెన్సింగ్, రీఎంట్రీ ప్రాజెక్టు’ వాలంటీర్ల సాయంతో జోసెఫ్‌‌ లిగోన్‌‌ ఇప్పుడిప్పుడే మెల్లగా అడ్జస్ట్ అవుతున్నాడు.