కొత్త వేరియంట్ ఎప్పుడొస్తుందనేది చెప్పలేం

కొత్త వేరియంట్ ఎప్పుడొస్తుందనేది చెప్పలేం

కొత్త వేరియంట్ ముప్పు ఎప్పుడొస్తుందనేది చెప్పలేమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. సీఎం అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారని ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మన ప్రవర్తనపైనే కొత్త వేరియంట్ ఆధారపడి ఉంటుందని హెల్త్ డైరెక్టర్ అన్నారు. బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. 

‘ఒమిక్రాన్ విదేశాల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే 25 దేశాలలో 215 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ మన దేశంలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఎట్ రిస్క్ దేశాల నుంచి 325 మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారిలో ఒకరికి పాజిటివ్ రావడంతో టిమ్స్ ఆసుపత్రికి తరలించాం. అంతేకాకుండా ఆమె శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపించాం. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. డిసెంబర్ చివరి వరకు వాక్సినేషన్ పూర్తి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా తమ వంతుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో కేసులు తగ్గుతున్నప్పటికి ఒమిక్రాన్ పై జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫంక్షన్లు, పండుగలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని శ్రీనివాస్ రావు అన్నారు.