గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌గా తెలంగాణను మారుస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌గా తెలంగాణను మారుస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ
  • 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి విద్య, వైద్యమే వెన్నెముక
  •     నర్సింగ్ స్టూడెంట్లకు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పిస్తున్నం
  •     యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్ వర్సిటీతో విప్లవాత్మక మార్పులు
  •     ‘తెలంగాణ రైజింగ్’ సమిట్‌‌‌‌లో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రం (గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్)గా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యం. రాష్ట్ర ఎకానమీని 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలన్న‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌‌‌‌లో విద్య, వైద్య రంగాలే వెన్నెముకగా నిలుస్తాయి’’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన గ్లోబల్ సమిట్‌‌‌‌లో ‘తెలంగాణ యాస్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి మాట్లాడారు. కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదని, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మిళితమైన విద్యే ప్రస్తుత ప్రపంచానికి అవసరమని ఆయన చెప్పారు.

ఆడబిడ్డలకు అండగా.. విదేశాల్లో ఉపాధి

‘‘పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నర్సింగ్ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే గతేడాది కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాం. మన ఆడబిడ్డలు విదేశాల్లోనూ రాణించేలా జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో శిక్షణ ఇస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉద్యోగాలు కల్పించడమే మా టార్గెట్’’ అని మంత్రి వివరించారు.

సామాజిక అసమానతలను తొలగించి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌‌‌తో విద్యను అందించేందుకే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ తీసుకొచ్చామని చెప్పారు. పరిశ్రమలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఆస్ట్రియాకు చెందిన ఆల్​ప్లా సంస్థతో కలిసి డ్యుయల్ అప్రెంటిస్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

నైపుణ్యం, పరిశోధనలపైనే  మా ఫోకస్: బాలకిష్టారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే కొత్త అభివృద్ధి నమూనాకు మద్దతుగా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. స్కిల్స్, రీసెర్చ్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌‌‌తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ టాలెంట్‌‌‌‌ను తెలంగాణ వైపు రప్పించేలా మన విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టీజీసీహెచ్‌‌‌‌ఈ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు.

టాలెంట్ హబ్‌‌‌‌గా తెలంగాణ: సంధ్య చింతల

విద్యా సంస్థలను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు, యువతకు జాబ్స్ కల్పించేందుకు సపోర్టుగా ఉంటామని నాస్కమ్ వైస్ ప్రెసిడెంట్ సంధ్య చింతల తెలిపారు. 33 జిల్లాల్లోని కాలేజీల్లో తమ ప్రమాణాలకు తగినట్లు ఉన్నవాటిని ‘ప్రిఫర్డ్ కాలేజీల’గా ఎంపిక చేసినట్టు చెప్పారు. ‘ప్రిఫర్డ్ కాలేజీల’ విద్యార్థులకు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్‌‌‌‌పై శిక్షణ ఇస్తామన్నారు. చదువు పూర్తవ్వగానే ఈజీగా జాబ్స్ వచ్చే చాన్స్ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో కేశవరావు, బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని మొత్తం విశ్వవిద్యాలయాల సంఖ్య 47
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 1,951
దేశంలోనే అత్యధిక కాలేజీల సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది రెండో స్థానం
గ్రాస్ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్ శాతంలో  రాష్ట్రం దేశంలోనే టాప్-5లో నిలిచింది