- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ భేటీ ఏర్పాటు చేయాలి
- కేంద్రానికి ప్రతిపక్ష పార్టీల లేఖ లేఖపై తృణమూల్ మినహా మిగతా పార్టీల సంతకాలు
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు పలు అపొజిషన్ పార్టీలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజుకు మంగళవారం లేఖ రాశాయి. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయని, ఆ తర్వాతే ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరాయి. 'నారీ శక్తి వందన్ అధినియం-2023(మహిళా రిజర్వేషన్ల చట్టం)' అమలు కార్యాచరణపై చర్చించేందుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయాలని ఈ నెల16న విజ్ఞప్తి చేసినట్టు ప్రతిపక్షాలు లేఖలో గుర్తు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ లేఖపై సంతకాలు చేశారు. చర్చలు ఫలప్రదంగా సాగాలంటే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల వివరాలను ముందుగానే పంచుకోవాలని వారు కోరారు.
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో ఉదయం జరిగిన సమావేశం తర్వాత కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ లేఖను కిరెన్ రిజిజుకు అందజేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, శివసేన (యూబీటీ) నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, సీపీ నేత పి. సంతోష్ కుమార్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత సుప్రియా సూలే ఉన్నారు. జేఎంఎం నేతలు మహువా మాఝీ, జోబా మాఝీ, ఎన్.కె. ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పీ), తిరుమావళవన్ తోల్కాప్పియన్ (వీసీకే), ఇ.టి. మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), జేకేఎన్ సీ, సీపీఐ- ఎంఎల్, డీఎంకె నేతలు కూడా తమ మద్దతు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్లే..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వచ్చే నెల మొదలుకానున్న జనాభా లెక్కలు ముగిసేందుకు దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో 2011 జనాభా లెక్కల ప్రకారమే లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఉన్న లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం చొప్పున పెంచాలని ప్రతిపాదించింది. కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సీట్లపరంగా తీవ్రంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డీలిమిటేషన్ చేసిన తర్వాత.. 2027 మార్చికల్లా అందుబాటులోకి వచ్చే కొత్త జనాభా లెక్కల ప్రకారం.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెచ్చిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా అమలు చేసి, 2029లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఆమోదింపచేసుకునేందుకు సిద్ధమైంది. దీనిపై ప్రతిపక్షాలతో సోమవారం సంప్రదింపులు కూడా జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు మంగళవారం చర్చించాయి. ఈ రెండు అంశాలపై ముందుగా అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, అది కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకే ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా స్పష్టం చేశాయి.
