- కలెక్టర్ హరిచందన దాసరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం ఎర్రగడ్డలోని టీబీ కంట్రోల్ ఆఫీసులో జిల్లా హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ 100 రోజుల పాటు క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గుర్తించిన స్లమ్ఏరియాల్లో కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్- 100 రోజుల కార్యక్రమ మొదటి దశను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మొదటి దశలో 22 వేల మంది టీబీ బాధితులను గుర్తించామన్నారు. ఏఐ సహాయంతో గుర్తించిన హై రిస్క్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతాల్లో టీబీ కేసులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు.
ఇప్పటికే 3 వేల న్యూట్రిషన్ కిట్లను అందజేశామన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి, జిల్లా క్షయ నివారణాధికారి డా.చల్లాదేవి, జాగృతి ఫౌండేషన్ నిర్వాహకులు కిరణ్ కుమార్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ మహేశ్ పాల్గొన్నారు.
