టైమ్ స్కేల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి:  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ 

టైమ్ స్కేల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి:  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ 
  • యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్
  • ఇందిరా పార్క్ వద్ద ధర్నా

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న టైమ్ స్కేల్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసనలో యూనియన్ నేతలు జై వెంకటేశ్, మెట్టు రవి, పద్మశ్రీ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని విమర్శించారు. తమకు నెలకు రూ. 26 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు రూ. 10 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని కోరారు.

అలాగే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.