కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేయట్లే : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేయట్లే : మంత్రి శ్రీధర్ బాబు
  •     ఏపీకి ఇచ్చినట్లు తెలంగాణకు నిధులు ఇవ్వాలి: శ్రీధర్ బాబు
  •     బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చొరవ చూపాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: దేశ జీడీపీలో 5 శాతం ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతోందని, అయినా కేంద్రం వివక్ష చూపడం అన్యాయమన్నారు. మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో హైదరాబాద్ లో గత రెండున్నర ఏండ్లలో నిర్మించిన ఫ్లైఓవర్లు, రోడ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సీఎం తరుఫున మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 

‘జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల పనులను వేటినీ రద్దు చేయలేదు. కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చేసినా పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నిటినీ రూ.2,250 కోట్లతో పూర్తి చేస్తాం. పనులు రద్దు చేస్తున్నామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేయెద్దు. 

నిర్మాణంలో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తాం. మేడ్చల్-–సుచిత్ర ఎలివేటెడ్ రోడ్డు పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాని కోరారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తాం. ప్యారడైజ్–శామీర్ పేట, ప్యారడైజ్–సుచిత్ర ప్రాజెక్టు పనులు కూడా టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మూసీ ప్రాజెక్టులో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి’ అని మంత్రి తెలిపారు. అమృత్ పథకం కింద ఏపీకి భారీగా నిధులు విడుదల అవడం సంతోషకరమని, అదే స్థాయిలో నిధులను తీసుకురావాలని బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులను కోరారు. 

స్కాలర్​షిప్​ల సంఖ్య పెంచాం: మంత్రి అడ్లూరి

ఓవర్ సిస్ స్కాలర్ షిప్ సంఖ్యను పెంచామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. రెండున్నర ఏళ్లలో 4,340 స్టూడెంట్స్ కు రూ.607 కోట్లు స్కాలర్ షిప్ చెల్లించామని, 520 మంది స్టూడెంట్స్ కు పెండింగ్ లో ఉందని మంత్రి తెలిపారు. ఈ నెల 31 లోగా చెల్లిస్తామన్నారు. ఓవర్ సిస్ స్కాలర్ షిప్ పై ఎమ్మెల్యేలు కూనంనేని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 

అనంతరం అనుబంధ ప్రశ్నలో ఇదే అంశంపై కేటీఆర్ ప్రశ్న అడిగారు.  సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని, గత ఏడాది బకాయిలు సుమారు  2500 మంది స్టూడెంట్స్ రూ.. 303 కోట్లు పెండింగ్ లో ఉంచారని  అన్నారు. 

డంప్ యార్డ్ సమస్య పరిష్కరించండి: మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గంలో జవహార్ నగర్ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని, పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. క్వశ్చన్ అవర్ లో గ్రేటర్ లో మున్సిపల్ పనులపై మల్లారెడ్డి మాట్లాడారు. “మేడ్చల్ లో పొల్యూషన్ పెరిగింది. డంప్ యార్డ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఎల్బీ నగర్-హయత్‌‌నగర్ మధ్య  ఎలివేటెడ్ కారిడార్: వెంకట్​రెడ్డి

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డబుల్ డెక్కర్ రోడ్లను నిర్మిస్తున్నామని, నగర ప్రజలకు ట్రాఫిక్ నుంచి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి-65ను ఆరు లేన్ల ప్రధాన రహదారిగా అభివృద్ధి చేయడానికి 2020–21 సంవత్సరంలో  రూ.545 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 

మన్ననూరు వరకు ఇప్పటికే 6 -లేన్ రహదారి అభివృద్ధి చేపట్టగా, అక్కడి నుంచి శ్రీశైలం వరకు సుమారు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.7,600 కోట్లని చెప్పారు. రాష్ట్ర కేబినెట్ స్థాయిలో ఇప్పటికే దీనికి అనుమతి లభించిందని, తుద ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.