ప్రభుత్వ హాస్పిటళ్లపై బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌ కుట్ర..ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌కు లబ్ధి చేకూర్చేందుకే ఆరోపణలు: మంత్రి దామోదర

ప్రభుత్వ హాస్పిటళ్లపై బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌ కుట్ర..ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌కు లబ్ధి చేకూర్చేందుకే ఆరోపణలు: మంత్రి దామోదర
  •     ప్రజలే వారికి గుణపాఠం చెప్తరని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ హాస్పిటల్స్‌‌పై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లుతున్నారని హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌‌లోని బస్తీ దవాఖానాలను అకస్మాత్తుగా తనిఖీ చేసి, పలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటళ్లపై నమ్మకం పోగొట్టేలా, ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చేలా వారు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

వీరి తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారే గుణపాఠం చెప్తారని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బ తీయలేవని స్పష్టం చేశారు. బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 

బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని, అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉన్నాయన్నారు. బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై పేషెంట్ల రద్దీ తగ్గిందని చెప్పారు. 

మెడిసిన్స్‌‌పై తప్పుడు ప్రచారం.. 

రసూల్‌‌పురా బస్తీ దవాఖానలో గడువు ముగిసిన మెడిసిన్స్‌‌ను పేషెంట్‌‌కు ఇచ్చారంటూ బీఆర్‌‌‌‌ఎస్ సోషల్ మీడియా చేసిన ఆరోపణలను రసూల్‌‌పురా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక ఖండించారు. ఎక్‌‌స్పైర్‌‌‌‌ మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ఓ మహిళా పేషెంట్‌‌కు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. హాస్పిటల్‌‌లో ఉన్న మెడిసిన్ స్టాక్ మొత్తాన్ని పరిశీలించానన్నారు. 

రసూల్‌‌పురా యూపీహెచ్‌‌ఎసీలో 2024 ఆగస్టులో తయారు చేసిన మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయని, వీటి ఎక్‌‌స్పైరీ 2026, జులైలో ఉందని ఆమె వివరించారు. 2025 జులైలో ఎక్‌‌స్పైరీ ఉన్న మందులు ఏవీ రసూల్‌‌పురా బస్తీ దవాఖానలో గానీ, యూపీహెచ్‌‌సీలో గానీ లేవని స్పష్టం చేశారు.

 ఆ మహిళా పలు అనారోగ్య సమస్యలతో తరుచూ రసూల్‌‌పురా బస్తీ దవాఖాన, యూపీహెచ్‌‌సీలో చికిత్స తీసుకుంటున్నదని చెప్పారు. గతంలో చికిత్స కోసం ఆమె వచ్చినప్పుడు ఇచ్చిన మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్‌‌ వెంట తెచ్చుకుని ఉంటుందన్నారు. బస్తీ దవాఖాన్లపై బురదజల్లేందుకు ఎక్‌‌స్పైరీ మెడిసిన్‌‌ను ఎవరైనా బయటి నుంచి తీసుకొచ్చి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.