పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తం : మంత్రి దామోదర రాజ నర్సింహ

పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తం : మంత్రి దామోదర రాజ నర్సింహ
  • అధ్యయనం కోసం నిపుణుల కమిటీ : మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు : గవర్నమెంట్ హాస్పిటల్స్​లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో పాటు, డీఎంఈ, డీహెచ్, వీవీపీ కమిషనర్ కూడా తమ పరిధిలోని హాస్పిటళ్లలో పని చేస్తున్న వారి బయోమెట్రిక్ అటెండెన్స్‌‌‌‌‌‌‌‌ను మానిటర్ చేయాలని ఆదేశించారు. పేషెంట్లతో ఎలా మాట్లాడాలో కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.‌‌‌‌‌‌‌‌ 

ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్​లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. డైట్, శానిటేషన్ సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల పనితీరు, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మూడు విభాగాలకు ప్రతి నెలా సకాలంలో నిధులు మంజూరు చేయాలి. సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. అధికారులు సమన్వయంతో పని చేయాలి. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారా.. లేదా.. అన్నది మానిటర్ చేయాలి. పీఎఫ్, ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలి. 

నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకోవాలి’’అని దామోదర అన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ విషయంలో ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, ఇందుకోసం ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీని నియమించాలని హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీని మంత్రి దామోదర ఆదేశించారు. 

టాయిలెట్ల సంఖ్య పెంపు

హాస్పిటళ్ల ఇన్​పేషెంట్, ఔట్ పేషెంట్ ఏరియాల్లో సరిపడా టాయిలెట్లు ఉండాలని అధికారులను మంత్రి సూచించారు. ‘‘దవాఖాన్ల వారీగా పేషెంట్ లోడ్, టాయిలెట్స్ సంఖ్య వంటి వివరాలతో నివేదిక తయారు చేయాలి. అవసరమైన చోట టాయిలెట్ల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ ఔట్ పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’’అని మంత్రి ఆదేశించారు.