- కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చేందుకు కేటీఆర్ ప్రయత్నం
- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్‌పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ఆ కుట్రలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. గాంధీ హాస్పిటల్‌లో ఒకే నెలలో 48 మంది పిల్లలు చనిపోయారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి దామోదర స్పందించారు. ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ దవాఖాన్లను నాశనం చేసి, కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని దామోదర మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో గాంధీ హాస్పిటల్‌పై బురదజల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని అన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ దవాఖాన్లను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చిపోలేదు.
గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పదేండ్ల పాటు నాశనం చేసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారు. వాళ్లను ఎలాగైనా బతికించేందుకు డాక్టర్లు తమ శక్తి మేర ప్రయత్నిస్తారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని కేటీఆర్ చేస్తున్నారు” అని మండిపడ్డారు.
తప్పుడు ప్రచారం ఆపండి: సూపరింటెండెంట్
కేటీఆర్ ఆరోపణలను గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ఖండించారు. పేదలకు వైద్యమందించే హాస్పిటల్‌పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘గాంధీకి వేల సంఖ్యలో ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి. ఇందులో చివరి నిమిషంలో వచ్చిన కేసులు వందల్లో ఉంటాయి. దురదృష్టవశాత్తు అప్పటికే పరిస్థితి విషమించి కొంత మంది ప్రాణాలు కోల్పోతారు.
ఇలా రకరకాల కారణాలతో ప్రతి నెల సగటున 25 నుంచి 35 నియోనాటల్ డెత్స్, 8 నుంచి 10 పీడియాట్రిక్ డెత్స్, 10 నుంచి 15 మెటర్నల్ డెత్స్ జరుగుతాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం, ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లను ఆందోళనకు గురిచేయడం సరికాదు” అని అన్నారు.