మెడికల్ కాలేజీల పనితీరుపై మంత్లీ రిపోర్టులివ్వండి : దామోదర

మెడికల్ కాలేజీల పనితీరుపై  మంత్లీ రిపోర్టులివ్వండి : దామోదర
  • పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచే చర్యలు చేపట్టండి: దామోదర

హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల పనితీరుపై నియమించిన ఎంసీఎంసీ(మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ) కమిటీలు ప్రతి నెలా రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ వైద్యుల సేవలు మెరుగుపడతాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడం, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడమే లక్ష్యంగా మంత్రి దామోదర గురువారం సెక్రటేరియెట్​లో సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ,  హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత మెడికల్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన కాలేజీలు, యూజీ, పీజీ సీట్ల సంఖ్యకు అనుగుణంగా హెల్త్ యూనివర్సిటీలో పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ, వీసీకి మంత్రి సూచించారు.

ఎగ్జామినేషన్ బ్రాంచ్ ను బలోపేతం చేయండి 

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల పనితీరు, విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యా బోధన నాణ్యతపై దామోదర సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత, వేగం కోసం ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు.