2, 3 రోజుల్లో ఇబ్రహీంపట్నం ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

2, 3 రోజుల్లో ఇబ్రహీంపట్నం ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో గత నెల 25వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి.. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన నివేదిక వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి కారణమైన బాధ్యులపై రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. MNJ క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లిన మంత్రి హరీష్ రావు.. హాస్పిటల్ పెండింగ్ వర్క్స్, కొత్త బిల్డింగ్ నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీష్ రావుతో పాటు, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ హాస్పిటల్ ను పరిశీలించారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం తన వంతుగా సాయం చేసేందుకు విజయేంద్ర ప్రసాద్ వెళ్లారు. 

450 పడకల హాస్పిటల్ లో మరో 300 పడకల ఏర్పాటుతో మరో బిల్డింగ్ నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బెడ్స్ సంఖ్యను కూడా పెంచుతున్నామన్నారు. వచ్చే నెల 15వ తేదీన కొత్త హాస్పిటల్ ను ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో ఉంటున్న డాక్టర్ అద్దంకి శరత్ .. మూడేళ్ల పాటు 300 బెడ్స్ కు శానిటేషన్, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది వంటి సదుపాయాలను ఉచితంగా అందిస్తామని చెప్పారని అన్నారు. వైద్య సిబ్బందికి కూడా ప్రతి నెల జీతాలు కూడా తామే చూసుకుంటామని తమకు హామీ ఇచ్చారన్నారు. MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో ఈ మధ్యే మాడ్యులర్ థియేటర్స్ ను ప్రారంభించామన్నారు. రోబోటిక్ థియేటర్ ఏర్పాటు కోసం టెండర్లు పిలుస్తామన్నారు. వైద్యుల కొరత లేకుండా 100 మంది వరకూ రిక్రూట్ చేస్తామన్నారు. పేషెంట్స్ డైట్ క్వాలిటీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.