హెల్త్​ సర్వే పేరిట ఎట్టి చాకిరీ!

హెల్త్​ సర్వే పేరిట ఎట్టి చాకిరీ!

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: హెల్త్​ ప్రొఫైల్​సర్వే పేరిట ఆశా కార్యకర్తలతో సర్కారు ఎట్టి చాకిరీ చేయిస్తోంది. పొద్దంతా కష్టపడుతున్నా వారికి రోజుకు ఇస్తున్నది రూ. 50 మాత్రమే. ప్రస్తుతం ఏ కూలి పని చేసినా రూ. 200 పైనే ఇస్తున్నారు. సర్కారు మాత్రం ఆశ కార్యకర్తలకు కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ సర్వే చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఎంపిక చేసింది. ఏఎన్ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలు టీంగా ఏర్పడి మార్చి నుంచి రెండు జిల్లాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 

ఇంకా 60 శాతమే..

ఇంటింటి సర్వే ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు 245 టీంలు, ములుగు జిల్లాలో  173 గ్రామాలకు 153 టీంలు పని చేస్తున్నాయి. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన రెండూ చిన్న జిల్లాలే అయినప్పటికీ సర్వే మందకొడిగా నడుస్తోంది. ప్రతి గ్రామంలో రెండు వేల కంటే ఎక్కువ జనాభా ఉండడం, టీంలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండడంతో సర్వే స్లోగా నడుస్తోంది. హెల్త్ ప్రాజెక్ట్ లో భాగంగా రెండు జిల్లాల్లో 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలురకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో టీం రోజుకు 40 ఇండ్లను సర్వే చేయాలని టార్గెట్​గా పెట్టారు. ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్ తీసుకుని ఆ వివరాలను ఆరోగ్య తెలంగాణ హెల్త్​ప్రొఫైల్ యాప్ లో ఎంటర్ చేస్తున్నారు. ఎత్తు, బరువు కొలవడం, గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అడిగి తెలుసుకుంటున్నారు.  రక్త నమూనాలను సేకరిస్తున్నారు. బీపీ, షుగర్, టీబీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సేకరించాల్సిన వివరాలు ఎక్కువగా ఉండడంతో రోజువారీ టార్గెట్​ను చేరుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు రోజువారి వేతనం రూ. 50 మాత్రమే ఇస్తామంటున్నారు. మూడు నెలలుగా సర్వే చేస్తునప్పటికీ ఆ మొత్తం కూడా పూర్తిగా ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం ఒక్కో ఆశ కార్యకర్తకు రూ. 1,320 మాత్రమే ఇచ్చారు. తక్కువ అమౌంట్ ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నా.. ప్రభుత్వం తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 

కనీసం రూ. 200 చెల్లించాలె

బయట రోజు కూలి రూ. 300 వరకు ఉంది. మాకు గౌరవ వేతనంగా కనీసం రెండు వందలైనా ఇవ్వాలి. మరీ యాభై రూపాయలు ఇస్తున్నారు. ఎమర్జెన్సీ కింద సెలవు పెట్టాల్సి వస్తే రీప్లేస్ కింద పని చేసేవారికి  మేం రూ. 300 మా జీతం నుంచి చెల్లించాల్సి వస్తోంది. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలి. మా వేతనాలు పెంచాలి. 
– అంబటి జ్యోతి, ఆశా కార్యకర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా

బడ్జెట్​ రాలేదంటున్నారు

సర్వే ప్రారంభించి ఇప్పటికి రెండున్నర నెలలు అవుతోంది. ఆశాలకు రోజుకు రూ.220 చొప్పున ఇస్తామని అన్నారు. బడ్జెట్ రాలేదు, రాగానే ఇస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రయాణం, భోజన ఖర్చులు మేమే భరిస్తున్నాం. హెల్త్ ప్రొఫైల్ సేకరణ పూర్తి కావస్తున్నా మాకు మాత్రం డబ్బులు రాలేదు. ములుగు జిల్లాలో 488 మంది ఆశాలు డ్యూటీలో ఉన్నారు. ఇతర పీహెచ్ సీల పరిధిలో కూడా డ్యూటీ వేస్తే సొంతంగానే వెళ్లి వస్తున్నాం. ఆశాలకు ఇస్తామని చెప్పిన విధంగా వెంటనే డబ్బులు అందించాలి.
– రత్నం నీల, ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, ములుగు