ఆరోగ్య తెలంగాణే మా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

ఆరోగ్య తెలంగాణే మా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు
  • 9 జిల్లాల్లో ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు
  • ఆరోగ్య తెలంగాణే లక్ష్యమని వ్యాఖ్య

కామారెడ్డి, వెలుగు: ఆరోగ్య తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమని, తల్లీబిడ్డల క్షేమం కోసం ఇప్పటికే ఉన్న కేసీఆర్​ కిట్లకు తోడుగా ఇప్పుడు కేసీఆర్​ న్యూట్రిషన్​ కిట్స్​ఇస్తున్నామని హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గర్భిణుల కోసం కేసీఆర్​ న్యూట్రిషన్​ కిట్ ​పంపిణీ  కార్యక్రమాన్ని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డితో కలిసి హరీశ్​రావు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్​లో ప్రారంభించారు. ఆదిలాబాద్, నాగర్​కర్నూల్, జోగులాంబ గద్వాల, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో వర్చువల్​గా మంత్రి ఈ స్కీంను ప్రారంభించగా, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడారు.

రాష్ట్రంలో బాలింత మరణాలు తగ్గినయ్

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి హరీశ్ అన్నారు. అందుకే కేసీఆర్​న్యూట్రిషన్​ కిట్​స్కీం​తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం పోషకాహార లోపంతో బాధపడుతున్న 9 జిల్లాల్లో ఈ న్యూట్రిషన్​ కిట్లు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో మిగతా జిల్లాలకూ విస్తరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు గతంలో కన్నా ఎంతో మెరుగయ్యాయని మంత్రి తెలిపారు. గతంలో 17వేల బెడ్లు ఉండగా, ప్రస్తుతం 28వేలకు పెంచామన్నారు. ఐసీయూ బెడ్లను 200  నుంచి 600 కు పెంచామన్నారు. కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

న్యూట్రిషన్ కిట్ దేశానికే ఆదర్శం: పోచారం

న్యూట్రిషన్ లోపంతో బాధపడున్న గర్భిణులకు కేసీఆర్​ న్యూట్రిషన్​ కిట్​ ఇవ్వడం దేశానికే ఆదర్శమని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్​లో సగం ఆస్పత్రులు మూతపడ్తాయని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి మాట్లాడుతూ..  పుట్టబోయే బిడ్డలే మన జాతి సంపద అని  అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్​పర్సన్​ దఫేదర్ శోభ, ఉర్దూ అకాడమి స్టేట్​ చైర్మన్​ ఎం.కె. ముజీబుద్దీన్, ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ శ్వేత, కలెక్టర్​ జితేశ్​ వి పాటిట్ తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు.. 

జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున స్థానిక ఏబీవీపీ లీడర్లను, కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్న రైతులను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్ట్  చేశారు.  లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన రైతులను, కలెక్టరేట్​కు వచ్చిన టెకిర్యాల్​కు చెందిన ముగ్గురు రైతులను అదుపులోకి తీసుకున్నారు.

భద్రాచంలో 14 మందికే అందజేత

రాష్ట్రవ్యాప్తంగా కిట్ తీసుకునేందుకు అర్హులైన గర్భిణుల లిస్టును జిల్లాల వారీగా తయారు చేసి వెబ్​సైట్​లో పెట్టారు. 34 వారాల లోపు గర్భిణులనే ఎంపిక చేయాలని గైడ్​లైన్స్ లో పేర్కొన్నారు. దాని ప్రకారమే అర్హులను ఎంపిక చేశారు. 2 వారాల క్రితమే ఈ స్కీంను ప్రారంభించాల్సి ఉన్నా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, బీఆర్ఎస్​ఆఫీసు ప్రారంభోత్సవం, తదితర కారణాలతో వాయిదా పడింది. ఈ ఆలస్యం వల్ల చాలా మంది గర్భిణులకు కిట్లు అందలేదు. బుధవారం భద్రాచలం ఏరియా దవాఖానాలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం కిట్లు పంపిణీ చేయగా.. లిస్టులో ఉన్న 37 మంది గర్భిణులను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తీసుకువచ్చారు. 34 వారాలలోపు వారికి మాత్రమే పంపిణీ సమయంలో చెప్పడంతో వాళ్లంతా ఖంగుతిన్నారు.