ఇవ్వాళా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్​పై విచారణ

ఇవ్వాళా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్​పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్   స్కామ్  కేసులో దర్యాప్తు సంస్థలు తనపై అరెస్టు లాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్  బుధవారం సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఈ స్కామ్ కు సంబంధించి పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆమె తరపు అడ్వొకేట్  వందన సెఘల్  మొత్తం 105 పేజీలతో కూడిన రిట్  పిటిషన్ ను దాఖలు చేశారు. ఈడీ ఆఫీసుకు మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశంపై పిటిషన్ లో పేర్కొన్నారు.

గతంలో ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, బెంగాల్  సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్  బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బెల ఎం.త్రివేది, జస్టిస్  పంకజ్ మిత్తల్ తో కూడిన బెంచ్  ముందుకు రాగా... ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది.

అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది. కాగా, ఈ పిటిషన్లను డిట్యాగ్  చేస్తామన్న బెంచ్.. నళిని చిదంబరం, అభిషేక్  బెనర్జీ, కవిత పిటిషన్లలో బుధవారం దేనిపై విచారణ చేపడుతుందో స్పష్టత రావాల్సి ఉంది.

తీర్పు ఎలా వస్తుంది?

తాజాగా ఈడీ, సీబీఐ నోటీసుల నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్ పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ పిటిషన్ ను చూపుతూ తాజాగా ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. అలాగే సీబీఐ ఇచ్చిన సమన్ల వ్యవహారంలో సమాధానం ఇచ్చిన కవిత ఈ కేసులోని అంశాలను సాకుగా చూపారు. ఈడీ కేసులో తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్  జనరల్  సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారన్నారు.

ఇదే హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని తన రిప్లై లో ప్రస్తావించారు. కాగా, ఈ పిటిషన్  విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వబోయే తీర్పు కవితకు కీలకంగా మారనుంది. ఆమెకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడితే, కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు కవిత విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సానుకూలంగా తీర్పు వెలువడితే, నిబంధనల ప్రకారం కవితను దర్యాప్తు సంస్థలు విచారించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.