
కొత్తగూడ, వెలుగు: బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో 30 ఏండ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఎంచగూడంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ శెట్టి పరశురాం భార్య మౌనిక(30) డీజే పాటలకు బతుకమ్మ ఆడుతుండగా ఉన్నట్టుండి కిందపడిపోయారు. తోటి మహిళల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మౌనిక చనిపోయారు. గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే, డీజే సౌండ్‌తోనే మౌనిక కుప్పకూలినట్లు స్థాని కులు చెప్తున్నారు. ఆమెకు ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారమే మౌనిక పుట్టిన రోజు కావడం, అదే రోజు ఆమె అంత్య క్రియలు జరగడంతో కటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి సీతక్క కోడలు కుసుమాంజలి గ్రామానికి వెళ్లి మౌనిక మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ పార్టీల లీడర్లు, జర్నలిస్టు యూనియన్ నాయకులు మౌనిక మృతి పట్ల సంతాపం తెలిపారు.