
- పాత బస్తీ తర్వాత అక్కడే ఎక్కువ.. విద్యుత్ సంస్థల ఆడిట్లో వెల్లడి
- ఆస్మాన్ ఘడ్లో 39%, చార్మినార్‌లో 38%, గజ్వేల్‌లో 35.5%, సిద్దిపేటలో 32.31% నష్టాలు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలు చేసే కరెంటు సరఫరాకు,నెల నెలా కరెంటు బిల్లుల్లో నమోదవుతున్న యూనిట్లకు మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. రోజుకు లక్షలాది యూనిట్ల కరెంటు లెక్కాపత్రం లేకుండా పోతున్నది. హైదరాబాద్ పాతబస్తీలోని ఆస్మాన్‌ఘడ్, చార్మినార్ డివిజన్ల తర్వాత గజ్వేల్, సిద్దిపేటలో ఎక్కువగా కరెంట్ లాస్ అవుతున్నట్లు విద్యుత్ సంస్థల ఎనర్జీ ఆడిట్లో తేలింది. ఆస్మాన్ ఘడ్ డివిజన్ పరిధిలో 39 శాతం, చార్మినార్ డివిజన్ లో 38 శాతం, గజ్వేల్‌లో 35.5 శాతం, బేగంబజార్‌లో 35 శాతం, సిద్దిపేటలో 32.31 శాతం, మెహిదీపట్నంలో 22 శాతం కరెంట్ నష్టాలు వస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో కొంత శాతాన్ని సాంకేతిక నష్టాలుగా తీసేసినా.. మిగతాది ఎటుపోతున్నదనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మీటర్ ట్యాంపరింగ్, అక్రమ కనెక్షన్ల వల్ల లాస్ వస్తున్నదని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 50లక్షల యూనిట్లు గాయబ్
ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రోజుకు 50 లక్షల యూనిట్ల కరెంటు మాయం అవుతున్నట్లు వెల్లడైంది. గ్రేటర్ పరిధిలో రోజుకు 56 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంటే.. బిల్లింగ్ లెక్కల్లో మాత్రం 51 మిలియన్ యూనిట్లుగా వస్తున్నది. 5 మిలియన్ యూనిట్లు.. అంటే 50 లక్షల యూనిట్ల విద్యుత్ లెక్కలోకి రాకుండా పోతున్నది. నిరుడు జులై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించిన ‘క్వార్టర్లీ ఎనర్జీ ఆడిట్’లో ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నెలకు రూ. 100 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1,200 కోట్ల విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు విద్యుత్ ఆడిట్ నివేదికల ద్వారా తేలింది. గృహ విద్యుత్ కోసమని కనెక్షన్ తీసుకొని కమర్షియల్‌కు వాడుకోవడం, మీటర్ ట్యాంపరింగ్, అక్రమ కనెక్షన్ల వల్ల విద్యుత్ లాస్ అవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రతి యాభై విద్యుత్ కనెక్షన్లలో ఒకటి అక్రమ కనెక్షన్ ఉన్నట్లు బయటపడింది. అక్రమ కనెక్షన్ల విషయంలో విద్యుత్ సిబ్బంది చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మణికొండ చిత్రపురి కాలనీలో భారీ భవనాల నిర్మాణాలకు కరెంట్ వాడుతున్నా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి 15 నెలలుగా సున్నా బిల్లింగ్ వచ్చింది.