క్రిటికల్‌ ‌‌‌గానే సౌమ్య కండీషన్.. కిడ్నీ, స్ప్లీన్ తొలగించిన డాక్టర్లు

క్రిటికల్‌ ‌‌‌గానే సౌమ్య కండీషన్.. కిడ్నీ, స్ప్లీన్ తొలగించిన డాక్టర్లు
  • వెంటిలేటర్, డయాలసిస్​పైనే ఎక్సైజ్ కానిస్టేబుల్..
  • కాస్త మెరుగుపడిన బీపీ, పల్స్ రేట్
  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ డాక్టర్లు
  • ఇటీవల నిజామాబాద్​లో డ్యూటీలో ఉండగా హత్యాయత్నం.. 
  • గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య

హైదరాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నిమ్స్ వైద్య బృందం హెల్త్ బులెటిన్‌‌‌‌‌‌‌‌  విడుదల చేసింది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన దాడిలో ఆమె కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ తో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

నిజామాబాద్ జిల్లా మాధవనగర్ రోడ్డులో జనవరి 23న డ్యూటీలో ఉండగా గంజాయి స్మగ్లర్ల దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బులెటిన్ ప్రకారం.. ఆమె లివర్, కిడ్నీ, స్ప్లీన్ (ప్లీహం) దెబ్బతినడంతో పాటు పక్కటెముకలు విరిగాయి. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ చికిత్స చేసి ఆమె ఎడమ కిడ్నీని, స్ప్లీన్‌‌‌‌‌‌‌‌ ను తొలగించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 25వ తేదీన అర్ధరాత్రి నిమ్స్‌‌‌‌‌‌‌‌కు రెఫర్ చేశారు.

కోలుకుంటున్నా.. ఇంకా క్రిటికలే...
నిమ్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సమయానికి సౌమ్య బీపీ 60/40కి పడిపోయిందని, పల్స్ రేట్ 140తో క్రిటికల్​గా ఉందని ఉందని బులెటిన్‌‌‌‌‌‌‌‌లో డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తున్నదని, బీపీ 106/54కు, పల్స్ రేట్ 109కి చేరి మెరుగుపడిందని తెలిపారు. సౌమ్య స్పృహలోనే ఉందని, డాక్టర్ల మాటలకు స్పందిస్తున్నదని పేర్కొన్నారు. 

అయినప్పటికీ ఆమె ఇంకా వెంటిలేటర్ పైనే ఉందని, కిడ్నీ పనితీరు కోసం డయాలసిస్ చేస్తున్నామని వివరించారు. నిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల సీనియర్ డాక్టర్ల బృందం సౌమ్య ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్‌‌‌‌‌‌‌‌లో స్పష్టం చేశారు.