
హైదరాబాద్: జంట నగరాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్‌లోని ‘పైగా’ కాలనీ నీట మునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని పరిశ్రమలు, షోరూమ్స్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారందరినీ బోట్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు.
ఘటనా స్థలికి చేరుకున్న హైడ్రా చీఫ్ రంగనాథ్ బోటులో వెళ్లి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతమైన ప్యాట్నీ నగర్ పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. వరద నీళ్లలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో NDRF సిబ్బంది బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
సికింద్రాబాద్లో అర గంటసేపు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూలు వదిలి పెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వరద నీరు పొంగిపొర్లడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.
సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ళ లోతుకు పైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటికి రానివ్వలేదు. వారి తల్లిదండ్రులు ఆటోడ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు. మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో వారి ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి.