హైదరాబాద్ శివారును కమ్మేసిన పొగమంచు.. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ శివారును కమ్మేసిన పొగమంచు.. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్
  • బెంగళూరు నేషనల్​ హైవేపై దారి కనిపించక ఇబ్బందులు 
  • ఎక్కడి వాహనాలు అక్కడే ఆపుకున్న డ్రైవర్లు
  • ఉదయం 9 గంటల వరకు కనిపించని రోడ్లు

హైదరాబాద్​సిటీ/ గండిపేట/ ఎల్​బీ నగర్​/ షాద్​నగర్​, వెలుగు: సిటీ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు కూడా ముందు వెళుతున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10:30 గంటల తర్వాత సూర్య కిరణాలు భూమిపై పడ్డాయి. ప్రధానంగా బెంగళూరు నేషనల్​హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కమ్మేయడంతో డ్రైవర్లు రోడ్లపైనే పక్కకు వాహనాలు ఆపుకున్నారు. దీంతో శంషాబాద్​నుంచి పాల్మాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​ఏర్పడింది. కొంతమంది లైట్లు వేసుకుని ప్రయాణం చేయడం కనిపించింది. 

ఈ వాతావరణం వల్ల శంషాబాద్​ ఎయిర్​పోర్టులో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. విజయవాడ హైవేలో వచ్చిపోయే వాహనాలు కూడా కనిపించలేదు. గండిపేట, బండ్లగూడజాగీర్, పటాన్‌‌‌‌చెరు, రాజేంద్రనగర్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, శామీర్‌‌‌‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దఅంబర్ పేట్, కొత్తగూడెం, బాటసింగారం, బాచారం, గౌరెల్లి, షాద్​నగర్​ తదితర ప్రాంతాల్లోనూ దట్టమైన పొగమంచు కనిపించింది. ఆఫీసులకు వెళ్లే వారు కూడా దారి కనిపించక కష్టాలు పడాల్సి వచ్చింది. ఓఆర్ఆర్ తో పాటు ప్రధాన హైవేలపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించలేదు. కొన్నిచోట్ల విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు, ఇండికేటర్లు వేసుకుని స్లోగా రాకపోకలు సాగించారు. గురువారం ఉదయం 8:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు ఇక్రిసాట్ వద్ద  కనిష్టంగా 13.4 డిగ్రీలు, అత్యధికంగా రాజేంద్రనగర్ లో గరిష్టంగా 30.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో తేలికపాటి పొగమంచు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీలు నమోదవుతాయని పేర్కొన్నారు.