ఢిల్లీలోని యమునా నది కాలుష్య కాసారంగా మారింది. వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకే విడుదల చేయడంతో నీరు మొత్తం కలుషితం అయిపోతోంది. దీంతో నది ఉపరితలంపై విషపూరిత నురుగు యొక్క మందపాటి పొర తేలుతూ ప్రవహిస్తోంది. అయితే విషపు నురగలపై జనం ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల్లో ఛత్ పూజా వేడుకల ఉండటంతో ..కాళింది కుంజ్ దగ్గర నదిలో విషపు నురగలు కనిపించడంపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఛత్ పూజా స్నానాలు ఎలా..?
అక్టోబర్ 30, 31 తేదీల్లో ఢిల్లీ ప్రజలు ఛత్ పూజా వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పవిత్రనది అయిన యమునా నదిలో భక్తులు తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. అనంతరం సూర్యునికి ప్రార్ధనలు చేస్తారు. అయితే ప్రస్తుతం యమునా నదిలో పుణ్యస్నానాలు ఆచరించే పరిస్ధితి లేదు. దీనికి కారణం విషపునురుగలు. ఈ విషపు నురగల్లో పుణ్యస్నానాలు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపునురగ ప్రమాదకరమైందని ...అందులో స్నానాలు చేస్తే మరింత ప్రమాదమని సూచిస్తున్నారు.
కేజ్రీవాల్ హామీ నదిలో కలిసింది...
ఛత్ పూజా వేడుకల కోసం సీఎం కేజ్రీవాల్ గతంలోనే హామీ ఇచ్చారు. ఛత్ పూజా స్నానాల కోసం యమునా నది వద్ద భక్తులకు ఘాట్‌లు, స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. దీనికి కోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని...ఛత్ పూజా సమయంలో యమునా నది కలుషితం కాకుండా చూస్తామని ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే కేజ్రీవాల్ హామీ ఇచ్చినా..నదిలో విషపునురగలు ప్రవహిస్తుండటంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చర్యలు తీసుకున్నా..అదే పరిస్థితి
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం ఏడాది కిందట కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేయటంతో ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది. ఈ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కాలుష్య తగ్గకపోవడంపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది నురగలోనే స్నానాలు..
గతేడాది కూడా ఛత్ పూజా వేడుకల సమయంలో యమునా నదిలో విషపు నురగలు కనిపించాయి. అయితే భక్తులు ఈ నీటిలోనే విషపు నురగల మధ్య పుణ్యస్నానాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. యమునానదిలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయని తమకు తెలుసని.. కానీ తమకు వేరే దారి లేదని చెప్పారు. మహిళలు నురగల మధ్యలో స్నానం చేస్తున్న వీడియోలపై నెటిజన్లు ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. నదులను శుభ్రం చేస్తామన్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.
పుణ్యం ఏమో కానీ..
యమునా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రజల విశ్వసిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో యమునా నదిలో స్నానం చేస్తే మాత్రం ఆరోగ్యాన్ని తీవ్ర హాని సంభవించడం ఖాయమంటున్నారు. అంతలా విషపూరితమైంది. కాలుష్యం వల్ల నదీ నీరు మొత్తం విషతుల్యంగా మారింది. ఫ్యాక్టరీలు, గృహ సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలతో యమునా జలం మొత్తం కలుషితంగా మారి... తెల్లని నురగ రూపంలో ప్రవహిస్తోంది.
