హైదరాబాద్లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని  పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 4వ తేది తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో చిరు జల్లులు పడుతున్నాయి.  అర్ధరాత్రి తర్వాత చినుకులతో మొదలైన వాన... హైదరాబాద్ వ్యాప్తంగా ముసురుపట్టింది. 

భారీగా ట్రాఫిక్ జామ్..

సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు గంట పాటు భాగ్యనగరంలో వాన దంచికొట్టింది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లిలో ఎడతెరిపిలేని వర్షం  పడుతోంది. అమీర్‌పేట, మైత్రీవనంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై  వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 నిమిషాల జర్నీకి అరగంట సమయం పడుతోంది. దీంతో రోడ్లపై వాహనాలను డ్రైవ్ చేయలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 
  
సికింద్రాబాద్  కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ముసురు పట్టింది. సుచిత్ర,కొంపల్లి,దూలపల్లి, దుందిగల్,గండిమైసమ్మ, మల్లంపేట్,బౌరంపేట్, బాహుదూర్ పల్లి, సురారం,జీడిమెట్ల,షాపూర్ నగర్,చింతల్,గాజులరామారం, జగద్గిరిగుట్టు, అటు పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ లో ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో వర్షం దంచికొడుతోంది.

వాన కారణంగా హైదరాబాద్ లోని పలు కాలనీల భవనాల్లోని సెల్లార్లలోకి నీరు చేరింది. అటు  నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.