హైద్రాబాద్ లో దంచికొట్టిన వాన

హైద్రాబాద్ లో దంచికొట్టిన వాన

హైదరాబాద్,వెలుగు : సిటీలో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మబ్బులు పట్టి ఉండగా.. 5 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు గంట పాటు వాన కురిసింది. చాలా చోట్ల వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్​జామ్​ఏర్పడింది.  సికింద్రాబాద్, అమీర్​పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్, కూకట్​పల్లి, అంబర్​పేట, మాదాపూర్​, ఫిలింనగర్​తదితర  ప్రాంతాల్లో భారీ వాన పడింది. వీకెండ్ కావడంతో సాయంత్రం ఇండ్ల నుంచి బయటకు రావడంతో వర్షంలో చిక్కిపోయారు.

బల్దియా డీఆర్ఎఫ్, వాటర్​బోర్డు ప్రత్యేక బృందాలు, పోలీసులు వరద నిలిచిన చోట్ల ప్రమాదాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దారు. ఈదురు గాలులు వీచడంతో చాలా రోడ్లపై చెట్టు కొమ్మలు విరిగిపడిపోయాయి. సిటీలో గరిష్టంగా 3.5 సెంమీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అమీర్​పేట, చార్మినార్​, హైటెక్​సిటీ, మెహదీపట్నం, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో 3 సెంమీ, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కాప్రా, మౌలాలి తదితర ప్రాంతాల్లో 3.2 సెంమీ వర్షపాతం మారేడ్​పల్లిలో 2.9సెంమీ  నమోదు అయినట్టు పేర్కొన్నారు. వర్షం కారణంగా విద్యుత్​సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్​సరఫరాను నిలిపివేశారు.