కుండపోత వర్షం..రోడ్లపై వరద ప్రవాహం..రాబోయే నాలుగు రోజులు బీభత్సమైన వానలు..

కుండపోత వర్షం..రోడ్లపై వరద ప్రవాహం..రాబోయే నాలుగు రోజులు బీభత్సమైన వానలు..


హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్, ఖైరతాబాద్, అబిడ్స్, బాల్ నగర్, చింతల్, సికింద్రాబాద్, ప్యారడైస్తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. రెండు గంటలుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హైదరాబాద్ తో పాటు..రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది.  ఆదిలాబాద్ , కుమరంభీం, మంచిర్యాల ,నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం , సూర్యాపేట జిల్లాల్లో వాన కురుస్తోంది. 

మరోవైపు రాష్ట్రంలో  రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 12వ తేదీ  మంగళవారం నుంచి జులై 13వ తేదీ బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జులై 13వ తేదీ  బుధవారం నుంచి జులై 14వ తేదీ గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండలో భారీ వానలు పడుతాయని చెప్పింది.

జులై 14వ తేదీ గురువారం నుంచి జులై 15వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. జులై 15వ తేదీ శుక్రవారం నుంచి జులై 16వ తేదీ శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది.

జులై 17వ తేదీ ఆదివారం  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.