వర్ష బీభత్సం.. కూలిన చెట్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు

వర్ష బీభత్సం.. కూలిన చెట్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు

రంగారెడ్డి జిల్లా మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడలో భారీ వర్షం పడింది. నార్సింగ్ లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నార్సింగ్ మున్సిపాల్టీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అటు జనగామ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి జనగామ హన్మకొండ రహదారికి ఇరువైపుల ఉన్న చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లపై చెట్లు కూలిపోవడంతో  జనగామలో రాత్రి నుంచి పలు కాలనీల్లో  విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తెగిపడిన విద్యుత్ వైర్లను అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఉరుములు,  మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటల వ్యవధిలోనే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయితే కొన్ని రోజులుగా జిల్లాలో ఎండలు విపరీతంగా కొట్టాయి. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూశారు.  ఈ సమయంలో వర్షాలు పడటంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.