తెలంగాణలో భారీ వర్షం.. నేలకొరిగిన వృక్షాలు, పలుచోట్ల పిడుగులు

తెలంగాణలో భారీ వర్షం.. నేలకొరిగిన వృక్షాలు, పలుచోట్ల పిడుగులు

ఆదివారం(జూన్ 4) సాయంత్రం తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో చెదురు ముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వర్షం పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపగా, మరికొన్ని చోట్ల పిడుగులు పడటం, చెట్లు నేలకొరగడం వంటి ఘటనలు జరిగాయి. 

సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్ఐజి కాలనీలో కొబ్బరి చెట్టుపై పడ్డ పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

మేడ్చల్ జిల్లా:

మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని కీసర, బోగారం, తిమ్మాయపల్లి, యాదగిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల్, దాయరా గ్రామలల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.

జగిత్యాల: 

కోరుట్ల నియోజకవర్గ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రచార ఆర్చీ రహదారికి అడ్డంగా కూలింది. దీంతో కోరుట్ల-మెట్ పల్లి రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

వికారాబాద్ జిల్లా:

వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండలం సాల్వీడ్ లో గొర్రెల మందపై పిడుగు పడింది. ఈ ఘటనలో గడుసు అంజయ్య అనే రైతుకు చెందిన 9 గొర్రెలు, బసమ్మ అనే మహిళకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. అదే గ్రామంలో మరోచోట పిడుగు పడగా, ఈ ఘటనలో అంజిలయ్య అనే రైతుకు చెందిన 3 గొర్లు, కృష్ణయ్య అనే రైతుకు చెందిన 4 గొర్రెలు మృతి చెందాయి. 

సంగారెడ్డి:

సంగారెడ్డి పరిధిలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి, నాగల్ గిద్ద, మనూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి పలుచోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా, మరికొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. 

ఖమ్మం:

ఖమ్మం పరిధిలోని గోపాలపురంలో పెను ప్రమాదం తప్పింది.  ఈదురు గాలులకు ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ స్తంభం నేలకొరిగింది. అయితే ఆ సమయంలో రహదారిపై ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.