తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లతో బీభత్సం..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లతో బీభత్సం..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. మంగళవారం ( మార్చి 17 ) రాత్రి ఈదురుగాలులు, వడగళ్లతో కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో భారీగా పంటనష్టం సంభవించింది. చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.రానున్న రెండు, మూడు రోజులు వర్షాలతో ఉష్నోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని... గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని... ఈదురు గాలుల తీవ్రత సైతం పెరిగి 40 నుంచి 50, అక్కడక్కడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వడగాండ్ల వర్షం సైతం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వడగండ్ల వర్షంతో గ్రామ శివారులో ఆరు మందికి చెందిన 150 మేకలు మృతి చెందాయి.

చౌడాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన కొందరు సంచార కాపరులు మేడిపల్లి దగ్గర మేకలను ఆపి ఉండగా కురిసిన వర్షానికి మేకలు మృతి చెందాయి. దాదాపు 20 లక్షల వరకు నష్టం వాటిలందని అంటున్నారు కాపరులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు కాపరులు.

వాలిన మొక్కజొన్న.. రాలిన మామిడి

మెదక్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులకు తోడు వర్షం, వడగండ్లు పడడంతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా హవేలీ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని గాజిరెడ్డిపల్లి తండా, బూరుగుపల్లి, తోగుట గ్రామాల్లో 135 ఎకరాల్లో వరికి నష్టం జరిగినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నేలవాలగా.. పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. హనుమకొండ జిల్లా గట్ల నర్సింగాపూర్‌‌‌‌‌‌‌‌లో మొక్కజొన్న, ముస్తఫాపూర్‌‌‌‌‌‌‌‌లో మూడెకరాల మామిడితోట దెబ్బతింది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని అలంఖాన్‌‌‌‌‌‌‌‌గూడ, రావులపల్లి కలాన్, దోబిపేట తదితర గ్రామాల్లో భారీ సైజులో వడగండ్లు పడ్డాయి. వీటిధాటికి వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు దెబ్బతిన్నాయి.