రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులుపడ్డాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా వాన కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.  
సిద్దిపేట జిల్లా గజ్వేలు మండలం బెజగన్ లో 13 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దుబ్బాక పోతిరెడ్డిపేటలో 11.2, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 13.1, మహబూబ్ నగర్ లో 9.2, మెదక్ జిల్లాలో నిజాంపేటలో 8.6, సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. వర్షాలతో కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడుస్తోంది. చాలా ప్రాంతాల్లో రైతులు రాత్రి నుంచి ధాన్యం తడవకుండా కవర్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వాన నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి కన్నీరు పెడ్తున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాసున్నా ధాన్యం కొనడం లేదని మెదక్ జిల్లాలోని రైతులు ఆందోళన చేశారు. వానలకు ధాన్యం తడిసి పోయి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. భారీ వర్షానికి నల్గొండ జిల్లాలో వెలిమినేడు PACS పరిధిలోని అరేగూడెం, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, పేరేపల్లి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. 2 నెలలుగా వడ్ల కొనకపోవడంతో వర్షానికి తడిసి పోయి నిండా మునిగామన్నారు రైతులు.